ప్రకాశం జిల్లా కురిచేడులో 10మంది దుర్మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇటీవల ఈ విధమైన దుర్ఘటనలు పదేపదే చోటుచేసుకోవడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

''ఈ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలి. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలి'' అని డిమాండ్ చేశారు. 

''రాష్ట్రంలో గత 14నెలలుగా కల్తీ మద్యం దుర్ఘటనలు పేట్రేగడం బాధాకరం. నాటు సారా తాగి, కల్తీ మద్యం సేవించి, శానిటైజర్లు తాగి పలువురు చనిపోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంది. రాష్ట్రంలో మద్యం ధరలు 300%పైగా పెంచేశారు. నాసిరకం బ్రాండ్లు మాత్రమే విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యం సర్వనాశనం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా పెరిగిపోయింది'' అని ఆరోపించారు. 

read more   శానిటైజర్ కలిపిన సారా తాగి ఏపీలో ఏడుగురు మృతి

''గడ్డివాముల్లో, మొక్కజొన్న మోపుల్లో, లారీల్లో ఎక్కడ చూసినా అక్రమ మద్యం నిల్వలే... వైసిపి కార్యకర్తలే మొబైల్ బెల్ట్ షాపులుగా మారారు. టూ వీలర్(ద్విచక్ర వాహనాల) మొబైల్ బెల్ట్ షాపుల సంస్కృతి కొత్తగా తెచ్చారు. వందలాది ద్విచక్ర వాహనాలను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు మీడియాలో చూశాం'' అని అన్నారు. 

''రాష్ట్రంలో నాటుసారా తయారీ యధేచ్చగా సాగుతోందని, సారా విక్రేతలదే రాజ్యంగా మారిందని సాక్షాత్తూ అసెంబ్లీ స్పీకర్ ధ్వజమెత్తడం తెలిసిందే. రాష్ట్రంలో అన్ని జిల్లాలలో వైసిపి మద్యం మాఫియా ఆగడాలు పేట్రేగిపోయాయి. నాటుసారా తయారీ, కల్తీ మద్యం అమ్మకాలు, అక్రమ మద్యం రవాణా వెనుక ప్రధాన సూత్రధారులు వైసిపి నాయకులే'' అని చంద్రబాబు ఆరోపించారు. 

''మద్యం మాఫియా దుర్మార్గాలకు అమాయకుల ప్రాణాలు బలికావడం బాధాకరం. లిక్కర్ మాఫియా అరాచకాలపై కఠిన చర్యలు చేపట్టాలి. కురిచేడు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని'' చంద్రబాబు డిమాండ్ చేశారు.