TDP Chandrababu Naidu: వరద కష్టాల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వం ఉందనే నమ్మకాన్ని కల్పించాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పాలకుల అలసత్వంతో వరద బాధితులు అల్లాడుతున్నారని తెలిపారు. వరద బాధితులకు అండగా ఉంటూ సాయం చేయాలని టీడీపీ నేతలకు ఆయన పిలుపునిచ్చారు.
TDP Chandrababu Naidu: గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా గోదావరిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో వరదలొచ్చి 6 జిల్లాల్లోని 42 మండలాల పరిధిలో 525 పైగా గ్రామాల ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. పోలవరం ముంపు గ్రామాలతో పాటు...లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
ఈ వరదలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.వరద బాధితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆదమరచి నిద్రపోతోందని ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటువంటి విపత్తుల సమయంలో ప్రజలను హెచ్చరించే వ్యవస్థలను.. జగన్ ప్రభుత్వం నాశనం చేసిందని విమర్శించారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం అందించే.. చిన్న చిన్న సూచన ప్రజలకు ధైర్యాన్ని ఇస్తాయని అన్నారు. తగిన సమయంలో అప్రమత్తం చేయడం వల్ల ప్రజల ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించగలమని తెలిపారు.
విపత్తులను ముందుగా తెలియజేసే సాంకేతిక వ్యవస్థను గత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకువచ్చిందనీ, వాటి ద్వారా విపత్తు ప్రభావిత గ్రామాల ప్రజలకు మొబైల్ ఫోన్ లకు రియల్ టైంలో వరద సమాచారం పంపి...వారిని అప్రమత్తం చేసేలా టెక్నాలజీని తీసుకువచ్చిందని తెలిపారు. ప్రకృతి విపత్తులలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని మోహరింప జేసి ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు తక్షణ సాయం అందించే వాళ్లమని తెలిపారు. అయితే.. నేడు రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదనీ, పూర్తిగా భిన్నంగా మారిందని, ఆనాటి వ్యవస్థలను పూర్తిగా నాశనం చేసారని తెలిపారు. యంత్రాంగాన్ని నడిపించాల్సిన పాలకుల అలసత్వంతో ప్రజలు అల్లాడుతున్నారన అన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు వరద బాధితులకు అండగా నిలిచి సాధ్యమైనంత సాయం చెయ్యాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వం కూడా ప్రతిపక్షాల డిమాండ్లపై రాజకీయ విమర్శలతో కాలయాపన చెయ్యకుండా ప్రజలను ఆదుకునే చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందనే నమ్మకాన్ని ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని అన్నారు.
