వైసిపి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజల కష్టాలను తొలగిస్తామని హామీ ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల సమీపిస్తున్న కొద్ది రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికార వైసిపి పై మండిపడ్డారు. జగన్ పాలనలో కరెంటు కోతలతో రాష్ట్ర ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజల కష్టాలు తీరుతాయని అన్నారు. తాము అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారు. కాకినాడ లో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధినేత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్ పాలనలో కరెంటు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, వైసీపీ నేతలకు ప్రజల సంక్షేమం కన్నా.. వారి వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లలో రూ. 40000 కోట్ల ప్రజాధనాన్ని వైసీపీ నేతలు దోచుకున్నారని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దొంగలు పెరిగారని, ఇసుక దొరక్క పేదలు ఇల్లు కట్టుకోలేకపోతున్నారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయంలో పేదలకు ఉచితంగా ఇసుక ఇచ్చే వాళ్ళమని గుర్తు చేశారు.
