జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా టిడిపి నిరసనలు మొదలుపెట్టింది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు, లోకేష్ లక్ష్యంగా పవన్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టిడిపి నేతలు, కార్యకర్తలు నిరసనలకు దిగారు. చాలా చోట్ల పవన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. దాంతో ఏం జరుగుతోందో అర్ధంకాక జనాల్లో అయోమయం మొదలైంది.

మొన్నటి వరకూ చంద్రబాబునాయుడు, పవన్ ఒకటే అనుకున్నారు. అందుకు పవన్ వైఖరి కూడా ఊతమిచ్చింది. దానికితోడు అమరావతి ప్రాంతంలో పార్టీ కార్యాలయం, నివాసం నిర్మాణాల కోసం పవన్ భూమిపూజ కూడా చేశారు. సుమారు రూ. 50 కోట్ల విలువైన భూమిని పవన్ కు చంద్రబాబే ఇప్పించారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.

మరి ఆ ప్రచారానికి విరుగుడుగానా అన్నట్లు బుధవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు, లోకేష్ అవినీతిపై పవన్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంలో మూడున్నరేళ్ళల్లో కనబడని అవినీతి పవన్ కు ఒక్కసారిగా నిన్ననే కనబడటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

సరే, చంద్రబాబు అవినీతిపై పవన్ ఎందుకలా మాట్లాడారనేది భవిష్యత్తులో తేలుతుంది. అయితే, ఆ విషయంలో టిడిపి మాత్రం చాలా వేగంగా స్పందించింది. పవన్ పై విరుచుకుపడుతున్నారు. ముందుజాగ్రత్తగా పవన్ బసచేసిన హోటల్ వద్ద భద్రతను అనూహ్యంగా పెంచారు. 

జనసేన పార్టీ డిజిటల్ విభాగం చేసిన ట్వీట్ కూడా భద్రత పెంపుపై మరింత స్పష్టత ఇస్తోంది. ఆ ట్వీట్ ఏంటంటే ‘రాష్ట్రంలో దేశంలో అనేక వ్యవస్థలు చేతిలో ఉన్న చంద్రబాబుని ఢీకొనటానికి పవన్ కళ్యాణ్ సిద్ధపడ్డారు’. ‘మీడియా అడ్డుపెట్టుకుని వ్యక్తిత్వాన్ని హననం చేయొచ్చు’ ‘వేరే ఇతర వ్యవస్థలను దుర్వినియోగపరిచి ఏమైనా చేయొచ్చు’. ‘పవన్ బలం, బలగం మనమే..కాబట్టి అనుక్షణం వేకువతో అందరూ జాగ్రత్తతో ఉండాలి’ అంటూ ట్వీట్ చేయటం గమనార్హం.