స్థానిక సంస్థల కోటాలో శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసే తెలుగు దేశం  అభ్యర్థుల జాబితాను పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రాత్రి బాగా పొద్దు పోయాక ఖరారు చేశారు.

 

ఈ జాబితాను పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కె కళావెంకట్రావు ప్రకటించారు. అభ్యర్థులు వీరే :శత్రుచర్ల విజయరామరాజు (శ్రీకాకుళం), చిక్కాల రామచంద్రరావు) తూర్పుగోదావరి), అంగర రామ్మోహన్‌, మంతెన సత్యనారాయణరాజు(పశ్చిమగోదావరి జిల్లా), వాకాటి నారాయణరెడ్డి (నెల్లూరు జిల్లా), శిల్పా చక్రపాణిరెడ్డి (కర్నూలు జిల్లా), రాజసింహులు (దొరబాబు) (చిత్తూరు జిల్లా), దీపక్‌రెడ్డి (అనంతపురం జిల్లా) కడప జిల్లా అభ్యర్థిగా బీటెక్‌ రవిని పేరు ఇది వరకే ప్రకటించారు.  ఆయన నామినేషన్ కూడా వేశారు.

 

కుల సమీకరణాలు, స్థానిక రాజకీయ వర్గాలు, గతంలో ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకుని అందరికీ సముచిత ప్రాధాన్యత కల్పించేందుకు ప్రయత్నించారని కళా వెంకటరావు తెలిపారు.

 

పార్టీని వెన్నంటి ఉన్నవారికి, గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం  రాని వారికి  (చిక్కాల రామచంద్రరావు, రాజసింహులు) ఈసారి అవకాశం కల్పించామని ఆయన చెప్పారు. గతంలో ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయినవారికీ (అనంతపురంలో దీపక్‌రెడ్డి), స్థానిక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని కొందరికీ అవకాశమిచ్చారు.


శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసిన శత్రుచర్ల విజయరామరాజు 2014 శాసనసభ ఎన్నికలకు ముందు టిడిపిలోకి వచ్చారు.  ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ముఠా రాజకీయల వల్ల  ఆయనవైపు నాయుడు మొగ్గుచారు. ఇపుడున్న ప్రముఖులెవరికీ ఆయనంటే ఇష్టం లేదు.

 

పశ్చిమ గోదావరి జిల్లాకు అంగర రామ్మోహన్‌ బిసి ప్రాతినిధ్యం కింద ఎమ్మెల్సీ టికెట్కు ఎంపిక చేశారు.