Asianet News TeluguAsianet News Telugu

బాలావీరాంజనేయస్వామి, బుచ్చయ్య చౌదరిలపై వైసీపీ సభ్యులు దాడి చేశారు.. టీడీపీ

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ఈరోజు వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ పరిణామాలపై టీడీపీ సభ్యులు అసెంబ్లీ వెలుపల మీడియాతో మాట్లాడారు. వైసీపీ సభ్యులు శాసనసభ పరువు తీస్తున్నారని మండిపడ్డారు.

TDP alleges YSRCP mlas attacked our members in ap assembly
Author
First Published Mar 20, 2023, 10:16 AM IST

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ఈరోజు వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ పరిణామాలపై అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ సభ్యులు అసెంబ్లీ వెలుపల మీడియాతో మాట్లాడారు. వైసీపీ సభ్యులు శాసనసభ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ వద్ద మేం నిరసన వ్యక్తం చేస్తున్నా వైసీపీ సభ్యులు వస్తారా? అని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమ సభ్యులపై దాడి చేశారని ఆరోపించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వెల్లంపల్లి తోసేశారని చెప్పారు. డోలా బాలావీరాంజనేయస్వామిపై సుధాకర్ బాబు, ఎలీజా దాడి చేశారని తెలిపారు. 

స్పీకర్ దగ్గర మినిట్ టూ మినిట్ వీడియో ఉందని అన్నారు. సభలో రికార్డు అయిన వీడియోను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తాము తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోవాలని అన్నారు. తమ సభ్యులు దాడి చేసినట్టుగా తేలితే చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ సభ్యులపై పథకం ప్రకారమే వైసీపీ సభ్యులు దాడి చేశారని ఆరోపించారు. తమపై దాడి చేసిందే కాకుండా.. తిరిగి తమపైనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్‌పై తాము దాడి చేసినట్టుగా అసత్యాలు చెబుతున్నారని అన్నారు.  

ఇదిలా ఉంటే.. ఈ రోజు ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే.. జీవో నెంబర్ 1 రద్దు చేయాలని టీడీపీ సభ్యులు నిరసన చేపట్టారు. ఈ మేరకు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు సిద్దమవ్వగా టీడీపీ సభ్యులు.. నిరసనకు దిగారు. ఈ సమయంలో టీడీపీ సభ్యుల వైఖరిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్‌కు గౌరవం ఇవ్వాలని టీడీపీ సభ్యులకు సూచించారు. అయితే తమ హక్కులను కాపాడాలని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకని స్పీకర్‌పై పేపర్లను చించివేశారు.

అయితే టీడీపీ సభ్యులపై అధికార పక్షం సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు సభను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సభ సజావుగా  జరగాలంటే.. వారిని సస్పెండ్ చేయాలని కోరారు. ఈ పక్షంలోనే ఇరు పార్టీల సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి,  వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబుల మద్య ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ సభ్యులపై వైసీపీ ఎమ్మెల్యే సంజీవయ్య దూసుకెళ్లగా.. మంత్రి అంటి రాంబాబు అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios