అమరావతి: ఏపీలో వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపైనా, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కయ్యాడో జూనియర్ ఆర్టిస్ట్. మంత్రి అనిల్ కుమార్ ను కులంపేరు వాడుతూ వ్యాఖ్యలు చేయడంతో అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన వరదలపై తెలుగుదేశం పార్టీ యాడ్స్ లలో నటించిన నటుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగం దృష్టిసారిస్తుంటే జూనియర్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరి మాత్రం తన నటనకు పదునుపెట్టారు. 

వరదనీటిలో నిలబడి ఒకరైతు వేషంలో నటిస్తూ ఏపీ ప్రభుత్వంపై తన ప్రతాపం చూపించాడు. వరద బాధితులం అంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాడు. నోటికి ఏది వస్తే అది అన్నట్లుగా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఒకానొక దశలో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ను కులం పేరును సైతం ప్రస్తావించారు.  

వరద బాధితులం అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ శేఖర్ చౌదరి నటించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. మంత్రి అనిల్ పై శేఖర్ చౌదరి చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. యాదవ సంఘం ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.  

విజయవాడ సత్యనారాయణపురం, కృష్ణా జిల్లా తిరువూరు, ఎ.కొండూరు స్టేషన్లతోపాటు గుంటూరు, ఉభయ గోదావరి, వైఎస్సార్, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో శేఖర్ పై ఫిర్యాదు చేశారు. అందుకు అనుగుణంగా శేఖర్ చౌదరి వీడియోలను సైతం పోలీసులకు అందజేశారు.  

ఈ నేపథ్యంలో ఆర్టిస్టు కుడితిపూడి శేఖర్‌ చౌదరిని విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్, మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యలపై ఆరా తీశారు. వరదల్లో ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారో చెప్పాలంటూ ఆరా తీయగా మరో ముగ్గురి పేర్లు బట్టబయలు చేశాడు శేఖర్ చౌదరి. 

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శివప్రసాద్, సీతారామయ్య, శివయ్య అనే మరో ముగ్గురు నటుల పేర్లను చెప్పుకొచ్చాడు. దాంతో పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడానికి తాను ఒక్కడినే కాదని, తమ లాంటి టీమ్‌లు చాలా పనిచేస్తున్నాయని పోలీసుల విచారణలో శేఖర్ చౌదరి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. నెలవారీగా వేతనాలు ఇచ్చి, ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేయడానికి తమను వాడుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారట.  

ఇకపోతే రవిశేఖర్ చౌదరి వీడియోలకు అయ్యే ఖర్చును తెలుగుదేశం పార్టీ నేతలే సమకూరుస్తాన్నారని పోలీసుల విచారణలో స్పష్టం చేసినట్లు సమాచారం. ఇకపోతే శేఖర్ చౌదరిది గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం. ఎన్నికల సమయంలో టీడీపీ ప్రకటనల్లో కూడా నటించాడు.

శేఖర్ చౌదరి వీడియోలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వైసీపీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి తెరవెనుక టీడీపీ భారీ కుట్ర పన్నుతోందని ఆరోపిస్తోంది. అందులో భాగంగానే పెయిడ్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరిని టీడీపీ తెరపైకి తెచ్చిందని ఆరోపించింది.