పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు నియోజకవర్గం నరసాపురం లోక్ సభ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కొనసాగుతున్నారు. అయితే ఈసారి ప్రతిపక్షాలన్నీ కలిసి వైసిపిపై పొలిటికల్ దాడి చేయడంతో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ క్రమంలో తణుకు పోరు కూడా రసవత్తరంగా మారింది. 

తణుకు రాజకీయాలు :

తణుకు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. టిడిపి ఆవిర్భావం నుండి తణుకులో పచ్చజెండా ఎగురుతూనే వుంది. 1983 నుండి 1994 వరకు వరుసగా నాలుగుసార్లు చిట్టూరి వెంకటేశ్వరరావు, 1999లో వైటి రాజా టిడిపి నుండి ప్రాతినిధ్యం వహించారు. అయితే మధ్యలో 2004, 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హవా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగడంతో తణుకులో కూడా కాంగ్రెస్ గెలిచింది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ టిడిపి అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ గెలిచారు. 

2019 ఎన్నికల్లో వైసిపి గాలి వీయడంతో మళ్ళీ తణుకు వైసిపి హస్తగతం అయ్యింది. మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు మరోసారి వైసిపి తరపున పోటీచేసి గెలుపొందారు. ప్రస్తుతం తణుకు ఎమ్మెల్యేగా ఆయనే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

తణుకు నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. అత్తిలి
2. ఇరగవరం
3. తణుకు 

తణుకు అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,32,219
పురుషులు - 1,13,453
మహిళలు ‌- 1,18,759

తణుకు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

సిట్టింగ్ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు మళ్లీ తణుకు బరిలో దిగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తణుకు నుండి గెలిచి మంత్రి పదవి పొందిన ఆయన ఈసారి మళ్లీ పోటీలో నిలిచారు.

టిడిపి అభ్యర్థి :

మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణను తణుకు బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో ఇతడు కారుమూరి చేతిలో ఓటమిపాలైనా టిడిపి అధినేత చంద్రబాబు నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు... చాలామంది తణుకు సీటు ఆశించినా రాధాకృష్ణకే మరో అవకాశం ఇచ్చారు.

తణుకు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

తణుకు అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,88,494 (81 శాతం)

వైసిపి - కారుమూరి వెంకట నాగేశ్వరరావు - 75,975 ఓట్లు (40 శాతం) - 2,195 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి - అరిమిల్లి రాధాకృష్ణ - 73,780 (39 శాతం) - ఓటమి

జనసేన పార్టీ - పసుపులేటి వెంకట రామారావు - 31,961 (16 శాతం) - ఓటమి

తణుకు అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,79,400 (81 శాతం)

టిడిపి - అరిమిల్లి రాధాకృష్ణ - 1,01,015 (56 శాతం) ‌- 30,948 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం 

వైసిపి - చీర్ల రాధాకృష్ణ - 70,067 (39 శాతం) - ఓటమి