Asianet News TeluguAsianet News Telugu

స్పీకర్ పదవి నాకు సవాలే: తమ్మినేని సీతారాం

శాసనసభ విలువలను  ప్రతి సభ్యుడు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని  స్పీకర్ తమ్మినేని సీతారాం కోరారు.
 

tammineni sitaram thanks to legislators for electing as speaker of ap assembly
Author
Amaravathi, First Published Jun 13, 2019, 3:23 PM IST

 అమరావతి:శాసనసభ విలువలను  ప్రతి సభ్యుడు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని  స్పీకర్ తమ్మినేని సీతారాం కోరారు.

గురువారం నాడు ఏపీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఎన్నికైన తర్వాత అధికార, విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ఆయనను అభినందిస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నందుకు శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

దేశ వ్యాప్తంగా పలు శాసనసభల్లో చూస్తున్న ఘటనలను ఆయన ప్రస్తావిస్తూ... ఇలాంటి సమయంలో  తనకు స్పీకర్‌గా సభ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు.

ఏపీ అసెంబ్లీలో గతంలో  స్పీకర్లుగా పనిచేసిన వారు అనేక మంచి సంప్రదాయాలను నెలకొల్పారని సీతారాం గుర్తు చేశారు. సభను నడపడానికి ఉన్నత సంప్రదాయాలు ఎలా ఉండాలనే దానిపై గతంలో స్పీకర్లుగా పనిచేసిన వారు సూచించిన పెద్దల నుండి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ దఫా కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సుమారు 100 మంది ఉన్నారని తమ్మినేని సీతారాం చెప్పారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు.

దేశంలోనే ఏపీ శాసనసభను ఆదర్శంగా నడిపేందుకు తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని స్పీకర్ హామీ ఇచ్చారు.శాసనసభ నిర్ణయాలను న్యాయస్థానాలు సమీక్షించే పరిస్థితి వస్తే.... శాసనసభలు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు.రాజ్యాంగ విలువలను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు.

శాసనసభ్యులపై విశ్వసనీయతను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల ముందు ప్రజా ప్రతినిధులు చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు.

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నా దాన్ని అమలు చేసుకోకపోడం దురదృష్టకరమైన పరిణామంగా ఆయన అభిప్రాయపడ్డారు.  సమస్యలను  పరిష్కరించేందుకు వీలుగా చర్చించేందుకు సరైన పద్దతిలో అసెంబ్లీలో చర్చించాలని ఆయన ఎమ్మెల్యేలకుసూచించారు.

రానున్న ఐదేళ్లలో పార్టీ ఫిరాయింపులు.. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిర్యాదులు వచ్చే అవకాశం ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు తమ అభిప్రాయాలను ఓటు రూపంలో చెబుతారని.. గతంలో ఇదే రకంగా జరిగిందని ఆయన గుర్తు చేశారు. తనపై నమ్మకం ఉంచి స్పీకర్ పదవిని కట్టబెట్టిన వారి నమ్మకాన్ని వమ్ము చేయబోనని తమ్మినేని సీతారాం చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios