చోరీ కేసులో అరెస్ట్ చేసి తమ మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తమిళనాడుకు చెందిన దళిత మహిళలకు చిత్తూరు పోలీసుల మీద ఆరోపణలు చేశారు. దీంతో కేసు నమోదయ్యింది. 

చిత్తూరు : ఓ చోరీ కేసులో తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాకు చెందిన కొంతమందిని అనుమానితులుగా భావించిన పోలీసులు వారిని చిత్రహింసలకు గురి చేశారు. తమను శారీరకంగా, లైంగికంగా హింసించారంటూ క్రిష్ణగిరి జిల్లాకు చెందిన దళిత మహిళలు ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది. ఓ మహిళ మీద అత్యాచారం చేసారని ఆరోపించగా.. మరో మహిళ రాడ్డుతో తనను చిత్రహింసలు పెట్టారని ఆరోపించింది.

ఈ కేసులో పురుషులు కూడా ఉన్నారు. కాళ్లు చేతులు కట్టేసి తమను కొట్టారని వారి పేర్కొన్నారు. బంగారం చోరీ కేసులో మొత్తం ముగ్గురు పురుషులు, ఐదుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. మహిళల వెంట వారి కొడుకులు కూడా ఉన్నారు. అరెస్టు చేసిన వారిలో అయ్యప్పన్, పూమదిని చిత్తూరు కోర్టులో హాజరు పరిచి రిమాండ్ లో ఉంచారు. 

ఈ ఆరోపణలు వెలుగులోకి రావడంతో.. కేసు సంచలనంగా మారింది. వెంటనే పోలీసులపై చర్యలు మొదలయ్యాయి. కృష్ణగిరి జిల్లా మత్తూరు పోలీస్ స్టేషన్లో పూతలపట్టు ఎస్సై హరిప్రసాద్, కానిస్టేబుళ్లు రమేష్, తనికాచలం సహా మరికొందరి మీద కేసు నమోదయింది. అంతేకాదు చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అత్యాచారం కేసు కూడా మహిళల ఫిర్యాదు మేరకు నమోదయింది. సంబంధిత ఎస్సై కానిస్టేబుల్ వేర్వేరు స్టేషన్లకు బదిలీ కూడా చేశారు.

ఇల్లు అద్దెకిస్తే వ్యభిచారం, మట్కా.. ఖాళీ చేయమంటే చంపుతామని బెదిరిస్తూ.. వృద్ధురాలి ఆవేదన...

అసలేం జరిగిందంటే.. 
రెండు కిలోల బంగారం చోరీ కేసులో చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు, వన్ టౌన్ స్టేషన్ల్లో చోరీ కేసు నమోదయింది. ఈ చోరీకి తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా పులియాండం పట్టి గ్రామానికి చెందిన అయ్యప్పన్ సూత్రధారి అని పోలీసులు భావించారు. ఈ మేరకు అయ్యప్పన్ బంధువైన రమేష్, అయ్యప్పన్ రెండో భార్య రేణుక ఆమె ఐదేళ్ల కుమారుడితో సహా.. జూన్ 5 7 తేదీల్లో పూతలపట్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విచారించే క్రమంలో రేణుకను చిత్రహింసలు పెట్టారు. అయ్యప్పన్ దొరకలేదని అతడి గురించి సమాచారం తెలుసుకోవడానికి అయ్యప్ప అక్క సత్య, చిన్న కుమారుడు తమిళరసులకు రేణుకతో ఫోన్ చేయించి హోసూరులో జూన్ 9వ తేదీన అరెస్టు చేశారు. రెండు రోజుల తర్వాత అయ్యప్పన్ ను, అతని తల్లి కన్నమ్మ, మొదటి భార్య ఆమె ఏడేళ్ల కొడుకు, చెల్లి వరుసైన పూమదిని పులియాండంపట్టిలో అరెస్టు చేశారు. 

అక్కడి నుంచి బెంగళూరుకు తీసుకువెళ్లారు. పోలీసులు విచారణలో భాగంగా అయ్యప్పన్ ముఖం మీద కారం పోసి కొట్టారు. ఆ తర్వాత అక్కడి నుంచి అందరినీ పూతల పట్టుకు తీసుకువచ్చారు. అయ్యప్పన్ అక్క సత్య జూన్ 12వ తేదీన తమిళనాడు పోలీసులకు ఆన్లైన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెతోపాటు భర్త రమేష్ ను కూడా పూతలపట్టుకు తరలించారు. ఓ కానిస్టేబుల్ విచారణ సమయంలో తనను గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారంటూ అయ్యప్పన్ మొదటి భార్య తెలిపింది.
అయ్యప్పన్ తో పాటు మరికొందరిని తమిళనాడులోని పలు బంగారు దుకాణాలకు తిప్పారు. ఏ దుకాణాల్లో బంగారం అమ్మావో చెప్పమన్నారు. కొన్ని షాపుల నుంచి కొన్ని నగలను రికవరీ చేశారు. జూన్ 16వ తేదీన చిత్తూరులో అయ్యప్పన్ పూమది మినహా చిన్నారులతో పాటు 8 మందికి కుల సంఘం నాయకులు, న్యాయవాదుల సమక్షంలో 41ఏ నోటీసులు ఇచ్చి ఇళ్లకు పంపించారు.

ఇంటికి వెళ్లినవారు జూన్ 17వ తేదీన కృష్ణగిరి జిల్లా ఆస్పత్రిలో చేరారు. అక్కడ పోలీసులకు తమకు జరిగిన అన్యాయాన్ని తెలియజేశారు. దీంతో చిత్తూరు పోలీసులపై కేసు నమోదు అయింది. ఈ కేసులో నిజానిజాలు వెలికితీయడానికి క్రిష్ణగిరి జిల్లా కలెక్టర్ సరయు కమిటీని కూడా ఏర్పాటు చేశారు. 

చిత్తూరు పోలీసులు ఏమంటున్నారంటే..
చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి దీని మీద మాట్లాడుతూ... ‘ఈ ముఠా గతంలో తమిళనాడులోని అటవీ పోలీస్ అధికారులపై కూడా ఇదే తరహాలో ఆరోపణలు చేసిందని చిత్తూరు పోలీసుల మీద చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు.

జూన్ 15వ తేదీన చిత్తూరులో వైరముత్తు అయ్యప్ప అనుచరులను చిత్తూరు వన్ టౌన్ పూతలపట్టు స్టేషన్లలో బంగారం చోరీ కేసులో అరెస్ట్ చేసాం. సిపిఐ నేతలు, గ్రామ పెద్దల సమక్షంలో ఐదుగురు మహిళా నిందితులకు 41ఏ నోటీసులు ఇచ్చాం. ఆ తర్వాత తమిళనాడులోని ఊతంగరై స్టేషన్లో డిఎస్పీకి అప్పగించాం. అక్కడ వారు… తమను పోలీసులు వేధించలేదని వాంగ్మూలం కూడా ఇచ్చారు.

క్రిష్ణగిరి ఆసుపత్రి డీన్ కూడా వారిని పరీక్షించి శారీరకంగా వారి మీద ఎలాంటి హింస జరగలేదన్నారు. ఆ తర్వాత జూన్ 17న అంటే రెండు రోజులకి కొందరి ప్రలోభాలతో ఆ మహిళలే చిత్తూరు పోలీసుల మీద ఫిర్యాదు చేశారు. అయినా విచారణ పారదర్శకంగా జరగాలని ఉద్దేశంతోనే ఆరోపణలు వచ్చిన ఎస్ఐ కానిస్టేబుల్ లను బదిలీ చేసాం. ఏఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందని..’ ఎస్పీ తెలిపారు.