Asianet News TeluguAsianet News Telugu

తిరుపతి వివాదం: పవన్ కల్యాణ్ తో బిజెపి నేతల భేటీ

తిరుపతి లోకసభ సీటు తమకే కావాలంటూ జనసేన పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తో సోము వీర్రాజుతో పాటు ఇతర బిజెపి నేతలు భేటీ అయ్యారు.

Talks between Pawan Kalyan and Somu Veerraju on Tirupathi bypoll
Author
Hyderabad, First Published Jan 25, 2021, 1:19 PM IST

హైదరాబాద్: తిరుపతి లోకసభ సీటు విషయంలో ఇటీవల పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు దిగి వచ్చినట్లు కనిపిస్తున్నారు. పవన్ కల్యాణ్ తో సోము వీర్రాజు సమావేశమయ్యారు. ఇరు పార్టీల ఇతర నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నికపై జనసేన-బి.జె.పి. నేతల మధ్య సుధీర్ఘంగా చర్చలు జరిగాయి. హైదరాబాద్ లో ఆదివారం రాత్రి మూడు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో ముఖ్యంగా ఉప ఎన్నికలో అనుసరించబోయే వ్యూహం, లోక్ సభ స్థానం పరిధిలోని జనసేన-బి.జె.పి. నాయకులు, శ్రేణులను సమాయత్తం చేయడం వంటి విషయాలపై ఈ సమావేశంలో దృష్టి పెట్టారు. అదే విధంగా ప్రచారం, ఈ ప్రచారానికి బి.జె.పి. అగ్రనాయకత్వాన్ని ఆహ్వానించడం వంటి విషయాలపై ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే అభ్యర్ధి ఎంపికపై ఇంకో దఫా చర్చలు జరపాలని నిర్ణయించారు. ఇరు పార్టీలకు సంబంధించిన అభ్యర్ధుల వివరాలను పరిశీలించిన తరువాత అభ్యర్ధిని ఎంపిక చేయాలని నిశ్చయించారు. 

అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న పంచాయితీ ఎన్నికలపై కూడా చర్చ జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ పట్ల శ్రీ జగన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఈ సమావేశం గర్హించింది.  ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి పరిస్థితులు చూడలేదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించడం రాష్ట్ర ప్రభుత్వ విధి అని, అలా గౌరవించని పక్షంలో ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఉందని సమావేశం అభిప్రాయపడింది. ఈ విషయాన్ని బి.జె.పి అగ్రనాయకుల దృష్టికి తీసుకువెళ్లాలని ఈ సమావేశం నిర్ణయించింది. 

ఈ సమావేశంలో జనసేన పక్షాన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బి.జె.పి. నుంచి కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయమంత్రి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్, జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, బి.జె.పి. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల సహాయ ఇంఛార్జ్ సునీల్ దేవధర్, రాష్ట్ర బి.జె.పి. అధ్యక్షులు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి మధుకర్ పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios