జగన్ కు మంత్రివర్గమే అనవసరంగా పబ్లిసిటీ ఇప్పించినట్లైందని తల పట్టుకూర్చున్నారు.
చంద్రబాబునాయుడు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కకోలేకపోతున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. బస్సు ప్రమాదానికి సంబంధించి జగన్ వ్యవహారాన్ని మంత్రివర్గంలో చర్చించటంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లేకపోతే ప్రతిపక్ష నేతపై మంత్రివర్గంలో చర్చించటమేమిటి? ఐదు రోజుల క్రితం విజయవాడకు సమీపంలో జరిగిన ఓ బస్సు ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. బాధితులను పరామర్శించేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఘటనా స్ధలానికి వచ్చారు. అయితే, పోస్టుమార్టమ్ చేయకుండానే బస్సు డ్రైవర్ మృతదేహాన్ని అక్కడి నుండి తరలించేందుకు యంత్రాంగం సిద్ధం చేసింది. అదే విషయంలో కలెక్టర్, డాక్టర్ తో జగన్ వాదనకు దిగారు. అదికాస్త పెద్ద వివాదమై కూర్చుంది.
ఆ ఘటనకు సంబంధించి ఆసుపత్రి అభివృద్ధి కమిటి ఛైర్మన్ జగన్ పై ఫిర్యాదు చేయగా పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసారు. దాంతో వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నాయి. ఇవన్నీ ఓ వైపు జరుగుతుండగానే మొన్నటి క్యాబినెట్ సమావేశంలో ఏకంగా జగన్ పైనే చర్చ జరగటం పలువురిని ఆశ్చర్యపరిచింది. డాక్టర్, కలెక్టర్ తో జగన్ వివాదంపై మంత్రివర్గం చర్చించింది. అంతేకాకుండా ఆ వివాదానికి సంబంధించిన వీడియోను కూడా చంద్రబాబు అందరికీ చూపించారు.
నిజానికి జగన్ వ్యవహారం మంత్రివర్గంలో చర్చించాల్సినంత పెద్ద అంశం కాదు. ఒకవేళ మంత్రివర్గంలో చర్చించాలంటే ప్రమాదంపై చర్చించాలి. జగన్ తీరుపై స్పందించాల్సింది పార్టీ వేదికలపైనే. అలాంటిది ఏకంగా జగన్ పైనే మంత్రివర్గంలో చర్చించారంటేనే చంద్రబాబు ప్రతిపక్ష నేతను ఎదర్కోలేకపోతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష నేత గురించి మంత్రివర్గంలో చర్చించారంటేనే ప్రతిపక్ష నేతకు ఏ స్ధాయిలో ప్రాధానత్య ఇచ్చారో అర్ధమవుతోంది. క్యాబినెట్లో జగన్ పై జరిగిన చర్చ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా పబ్లిసిటీ అవ్వటం గమనార్హం. దాంతో జగన్ కు మంత్రివర్గమే అనవసరంగా పబ్లిసిటీ ఇప్పించినట్లైందని తల పట్టుకూర్చున్నారు.
