వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఈ నెల 20వ తేదీ నుంచి ద్వారాలు తెరుస్తామన్నారు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. సోమవారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... పార్టీలో చేరేందుకు ఎవరి మధ్యవర్తిత్వం అసవరం లేదని.. సరాసరి తన వద్దకు వచ్చి పార్టీలో చేరవచ్చునన్నారు.

కేవలం తాడిపత్రి మున్సిపాలిటీలోని వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించామని పెద్దారెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు జూలై 5 నుంచి తాడిపత్రిలో మట్కా కనబడకూడదని పోలీసులను ఎమ్మెల్యే హెచ్చరించారు.

అప్పటిలోగా మట్కాను పోలీసులు అరికట్టకుంటే వైసీపీ తరపున వార్డుకు ముగ్గురు నుంచి ఐదుగురిని నియమించి మట్కా రాసేవారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించడం జరుగుతుందన్నారు.

వైసీపీ పేరుతో బెదిరింపులకు దిగుతున్నాన్న జేసీ పవన్ ఆరోపణల్లో నిజం లేదన్నారు. గతంలో ఎవరు బెదిరింపులకు పాల్పడేవారో అందరికి తెలుసుని ఆయన ఎద్దేవా చేశారు.

స్పర్శ పేరుతో విరాళాలు సేకరించి కొనుగోలు చేసిన వాటిని తిరిగి తీసుకోవడం జేసీ వర్గీయులకే చెల్లుతుందని పెద్దారెద్ది ధ్వజమెత్తారు. వెనుకబడిన 15 వార్డుల్లో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి రూ. 2లకే క్యాన్ నీటిని అందజేస్తామని కేతిరెడ్డి తెలిపారు.