ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణపై తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన ఆడియో టేపులను ఇష్టారీతిగా ప్రసారం చేస్తూ దళితులను, ఇతర వర్గాల మహిళలను కించపరిచేలా ఆర్కే వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు.

గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఓటుకు కోట్లు కేసులో ‘బ్రీఫ్డ్‌మీ’ అని చంద్రబాబు రూ.5 కోట్ల విషయంలో అడ్డంగా దొరికినప్పుడు దాన్ని ప్రసారం చేయలేదని శ్రీదేవి ధ్వజమెత్తారు.

చంద్రబాబుకు ఏబీఎన్‌ ఛానెల్‌లో వాటా ఉండటమే దీనికి కారణమని ఉండవల్లి ఆరోపించారు. తనపై అసత్య ప్రసారాలు చేస్తున్నారని శ్రీదేవి దుయ్యబట్టారు. కనీసం కథనాల ప్రసారానికి ముందు తమ వివరణ అడగలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఒకప్పుడు రాధాకృష్ణను బూతు కిట్టూ అంటుంటే ఎందుకంటున్నారో అర్థమయ్యేది కాదని, కానీ ఇప్పుడు బాగా అర్థమవుతోందని శ్రీదేవి వ్యాఖ్యానించారు. బూతు ప్రసారాలు చేస్తున్నారు కాబట్టే ప్రజలు రాధాకృష్ణకు బూతుకిట్టు అనే బిరుదు ఇచ్చారని దుయ్యబట్టారు.

ఇవే ఆడియోలు, వీడియోలను మార్ఫింగ్‌ చేసి మీ తల్లినో, చెల్లినో, అక్కనో వెబ్‌సైట్‌లో పెడితే మీరు బాధపడరా అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబేమో దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని అన్నారని, టీడీపీ నేతలేమో దళితులు శుభ్రంగా ఉండరు, చదువుకోరంటూ అన్న మాటలను ఎమ్మెల్యే శ్రీదేవి గుర్తుచేశారు.  

ఏదైనా ప్రసారం చేసే ముందు సంబంధిత వ్యక్తుల వివరణ తీసుకోవాలని ఆమె సూచించారు. తనకు వైఎస్‌ జగన్‌ రాజకీయ భిక్ష పెట్టారని.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ కనుమరుగవుతుందని శ్రీదేవి తీవ్రంగా మండిపడ్డారు.