గుంటూరు జిల్లా తాడికొండలో రాజకీయ వివాదం ముదురుతోంది. వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మాజీ అనుచరుల నుంచి తనకు ప్రాణహానీ వుందంటూ నలుగురిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనను బెదిరిస్తున్నారని వాహనాల్లో మారణాయుధాలు పెట్టుకుని వెంటపడుతున్నారని ఆమె ఆరోపిస్తున్నారు.

మరోవైపు శ్రీదేవి పేకాట శిబిరాలను ప్రోత్సహించారంటూ ఆమె మాజీ అనుచరుడు సందీప్ ఆడియో విడుదల చేశారు. ఇందులో ఎమ్మెల్యే శ్రీదేవి తనతో మాట్లాడారని సందీప్ చెబుతున్నారు.

Also Read:ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వల్ల ప్రాణహాని.. సెల్ఫీ వీడియోలో సందీప్.

ఎమ్మెల్యే శ్రీదేవి పేకాటను ప్రోత్సహించారని ఆయన ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ ఆడియోపై శ్రీదేవి స్పందించారు. ఫోన్ ఆడియో సంభాషణ తనది కాదని , దానిని మార్ఫింగ్ చేశారన్నారు.

అవసరమైతే సాంకేతిక పరిజ్ఞానంతో టెస్టింగ్‌కు కూడా సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. ఆరోపణలు ఎదుర్కొనేందుకు ఎంతవరకైనా సిద్ధమని శ్రీదేవి తేల్చి చెప్పారు.

సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే నుంచే తనకు ప్రాణహానీ వుందంటూ సందీప్ సెల్ఫీ వీడియో ఒకటి విడుల చేశారు.