తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వల్ల ప్రాణహాని ఉందంటూ వైకాపా బహిష్కృత నేత సందీప్ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఉండవల్ల శ్రీదేవి అక్రమ కేసులు పెట్టి తనను వేధిస్తున్నారని, ముఖ్యమంత్రి జగనే తనను కాపాడాలని అభ్యర్థించారు. 

రెండ్రోజుల క్రితం గుంటూరులో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీదేవిపై శృంగారపాటి సందీప్, సలివేంద్రం సురేష్ లు ఆరోపణలు గుప్పించారు. దీని తరువాత వారిద్దరి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఎమ్మెల్యే శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు మేరకు ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామాలతో ఖంగుతిన్న సందీప్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అక్కడినుంచే సెల్ఫీ వీడియో విడుదల చేశాడు.

ఎమ్మెల్యే శ్రీదేవి తనపై అక్రమ కేసు పెట్టిందని, అందుకే అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. తన కుటుంబ సభ్యులు ఆందోళనతో ఉన్నారని భోరున విలపించరు. ఈ పరిస్థితిలో తనకు చావు తప్ప మరో మార్గం కనిపించటం లేదన్నారు. పార్టీకి మొదటి నుంచి సేవలందించానని, శ్రీదేవికి కష్టకాలంలో అండగా ఉన్నానని వివరించారు. సీఐ ధర్మేంద్ర, ఎమ్మెల్యే శ్రీదేవి వల్ల తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.