వీళ్ళుకదా సూపర్ పోలీసులంటే... ప్రాణాలకు తెగించి యువతిని కాపాడిన ఖాకీలు (వీడియో)
తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కృష్ణా నదిలో దూకి కొట్టుకుపోతున్న యువతిని కాపాడారు తాడేపల్లి పోలీసులు.

తాడేపల్లి : పోలీసులంటే కఠినంగా వుంటారు.. మానవత్వమే లేదన్నట్లు ప్రవర్తిస్తారనే అపవాదు వుంది. కానీ ఈ సూపర్ పోలీసులు ఆడబిడ్డ ప్రాణాలు కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయలేకుండా మానవత్వాన్ని ప్రదర్శించారు. యువతి ప్రాణాల కోసం పోలీసులు చేసిన సాహసం చూసి స్థానికులు ఆశ్యర్యానికి గురయ్యారు. ఇలా ప్రాణాలకు తెగించి యువతిని కాపాడిన తాడేపల్లి పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.
వివరాల్లోకి వెళితే... విజయవాడ రాణిగారితోటకు చెందిన యువతి పిళ్లా సూర్యతేజ(21) వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గురువారం రాత్రి పదిగంటల సమయంలో స్కూటీపై కృష్ణా నది వద్దకు వచ్చిన ఆమె పరుగున వెళ్లి వారధిపైనుండి దూకేసింది. ఇది గమనించిన కొందరు 112 కు కాల్ చేసారు. సమాచారం అందుకున్న తాడేపల్లి ఎస్సై రమేష్ తన సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు.
వీడియో
చిమ్మచీకటిలో ఎలాంటి రక్షణా చర్యలు లేకపోయినా తాడేపల్లి పోలీసులు యువతిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఎస్సైతో పాటు కొందరు కానిస్టేబుల్స్ వారధిపైనుండి తాడు సాయంతో నదిలోకి దిగారు. అతి కష్టంమీద దాదాపు కిలోమీటర్ వెళ్లాక యువతి కొట్టుకుపోతూ కనిపించిందని... వెంటనే నీటిలోకి దిగి ఆమెను ఒడ్డుకు తీసుకువచ్చినట్లు ఎస్సై తెలిపారు. స్పృహ కోల్పోయిన యువతిని ఓ దుప్పటిలో చుట్టి తీసుకువచ్చామని... ఈ క్రమంలో ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొన్నామని తెలిపారు. కానీ యువతిని కాపాడే విషయంలో వెనక్కి తగ్గలేదని... ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
Read More ఏకంగా రూ.400 కోట్ల లావాదేవీలే..! విశాఖలో ఇంటర్నేషనల్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు (వీడియో)
ప్రాణాలకు తెగించి మరీ యువతి ప్రాణాలు కాపాడిన తాడేపల్లి ఎస్సై శ్రీకాంత్, ఇతర సిబ్బందిని అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, డిఎస్పీ రాంబాబు అభినందించారు. శాలువాలతో వారిని సత్కరించారు. జిల్లా ఎస్పీ ప్రస్తుతం లీవ్ లో వుండటంతో ఆయన తరపున ఈ సన్మానం చేపట్టినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.