సదావర్తి భూములు వేలం పాట టీడీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు. గరిష్టంగా 60 కోట్ల 30 లక్షల ప‌ల‌క‌డం హర్షణీయమన్నారు. సదావర్తి భూముల వేలం పాట.. వైసీపీ నేతల విజయం.

టీడీపీ నాయ‌కులు అప్ప‌నంగా కాజేయాల‌ని చూసిన స‌దావ‌ర్తి భూములు వేలంలో గరిష్ఠ ధ‌ర‌కు అమ్ముడుపోవ‌డం శుభపరిణామని వైసీపీ అధికార ప్ర‌తినిధి వాసిరెడ్డి ప‌ద్మ వాఖ్యానించారు. స‌దావ‌ర్తి భూముల వేలం టీడీపీ నాయ‌కుల‌కు చెంప‌పెట్టులాంటిద‌ని ఆమె ఎద్దేవా చేశారు. సోమ‌వారం హైద‌రాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు.

 మొదటి నుంచి తాము చెబుతున్నదే ఇవాళ జరిగిందన్నారు. ప్రభుత్వ భూమిని టీడీపీ నాయకులకు క‌ట్ట‌బెట్టాల‌ని పచ్చ పార్టీ నేతలు తీవ్రంగా ప్ర‌య‌త్నించారన్నారు. అలా జరగకూడదని తాము కోర్టును ఆశ్రయించామని తెలిపారు. ఇవాళ వేలంలో 60 కోట్ల 30 లక్షల ప‌ల‌క‌డం హర్షణీయమని ఆమె పేర్కొన్నారు. ఇన్నాళ్ల‌కు స‌దావ‌ర్తి స‌త్రం భూముల విష‌యంలో స‌రైనా న్యాయం జ‌రిగింద‌న్నారు.

చెన్నైలోని సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాల భూముల‌పై సుమారు గంటపాటు బహిరంగ వేలం జ‌రిగింది. కొనుగోలు చేసేందుకు సుమారు 25 మంది వ్యాపారవేత్తలు పోటీ పడ్డారు. రహస్య టెండర్ ద్వారా మ‌రో ఆరుగురు పోటీ ప‌డ్డారు, ఈ ప్రొక్యూర్‌మెంట్ విధానం ద్వారా మరో ఇద్దరు పోటీ పడ్డారు. 60 కోట్ల 30 లక్షల రూపాయలకు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సత్యనారాయణ రెడ్డి సొంతం చేసుకున్నారు.

48 గంట‌ల్లో స‌గం ధ‌ర చెల్లించాలి.

స‌దావ‌ర్తి భూముల‌పై దేవాదాయ క‌మిష‌న‌ర్ అనూరాధ మాట్లాడుతూ.. వేలంలో అమ్మ‌బ‌డిన‌ సగం ధరను 48 గంటల్లో టీటీడీకి చెల్లించాల‌న్నారు. మిగిలిన మొత్తాన్ని న్యాయస్థానానికి చెల్లించాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. ఈ మొత్తం చెల్లించడంలో సత్యనారాయణ రెడ్డి విఫలమైతే అతని తరువాత అత్యధిక ధరకు పాడిన వ్యక్తికి ఈ భూములను కట్టబెడతామని ఆమె స్పష్టం చేశారు.