వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందేందుకే రాజధాని వ్యవహారాన్ని ప్రభుత్వమే సాగదీస్తోందా అన్నది తెలియటం లేదు.

స్విస్ ఛాలెంజ్ విధానంపై తాజాగా హైకోర్టులో మరో కేసు దాఖలైంది. సింగపూర్ కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకే ప్రభుత్వం నిబంధనలు సవరిస్తున్నట్లు పిటీషనర్ ఆరోపించారు. చెన్నైకి చెందిన ‘ఎన్వీఎన్ ఇంజనీర్స్ ప్రైవేటు లిమిటెడ్’ అనే సంస్ధ కేసు దాఖలు చేసింది. దాంతో ప్రభుత్వ వ్యవహారం కుక్కతోకలాగే ఉందన్న విషయం స్పష్టమవుతోంది. ‘స్విస్ ఛాలెంజ్’ విధానంలో ప్రభుత్వ తీరు కూడా అదే విధంగా ఉంది.

ఎంతసేపటికీ సింగపూర్ కంపెనీలకు ఎలాగ మేళ్ళు చేద్దామనే తప్ప నిబంధనలు అనుసరిద్దామని, పారదర్శకంగా వ్యవహరిద్దామని అనుకోవటం లేదు. రాజధాని నిర్మాణానికి సంబంధించి ‘స్టార్టప్ ఏరియా అభివృద్ధి’ ప్రజెక్టును సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టాలని సిఆర్డిఏ నిర్ణయించింది. దాంతో ఏ నిబంధన పెట్టినా ఆ కంపెనీలకు అనుకూలంగానే ఉండేట్లు చూస్తున్నది. దాంతో పలువురు కోర్టు మెట్లక్కుతున్నారు. ఇప్పటికే రెండుమార్లు ప్రభుత్వానికి తలంటిది కోర్టు. అయినా ప్రభుత్వం తన పద్దతి మార్చుకోవటం లేదు.

తాజాగా స్విస్ ఛాలెంజ్ పద్దతిలో సిఆర్డిఏ చేసిన చట్ట సవరణ రాజ్యాంగ విరుద్ధమంటూ కోర్టులో కేసు దాఖలైంది. స్విస్ ఛాలెంజ్ పేరుతో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలో పారదర్శకతో లేదని గతంలోనే కోర్టు ఆక్షేపించింది. స్విస్ ఛాలెంజ్ పద్దతిలో కాకూడా ఓపెన్ బిడ్డింగ్ విధానంలో టెండర్లు పిలవాలని కూడా ఆదేశించింది. అయినా ప్రభుత్వ ముఖ్యులు తమ పద్దతి మార్చుకోలేదు. రాజధానికి స్ధలం ఎంపిక చేసిన దగ్గర నుండి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి ప్రభుత్వాన్ని.

రాజధాని కోసం స్ధలం ఎంపిక, రైతుల నుండి భూసమీకరణ విధానం, పరిహారం చెల్లింపు తదితరాలన్నింటిలోనూ భారీ స్కాం జరిగిందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అయినా ప్రభుత్వం ఎవరినీ ఖాతరు చేయకుండా తాననుకున్న పద్దతిలోనూ ముందుకు వెళుతోంది. రాజధాని నిర్మాణం పేరుతో అన్నీ నిబంధనలను ప్రభుత్వం యధేచ్చగా ఉల్లంఘిస్తోందంటూ కోర్టులో కేసులు దాఖలయ్యాయి.

ఎప్పుడూ పారదర్శకత గురించి మాట్లాడే నిప్పు చంద్రబాబునాయుడు తన ఇష్టమొచ్చినట్లే వ్యవహరిస్తుండటం గమనార్హం. ఇప్పటికే పలుమార్లు న్యాయస్ధానం తలుపులు తట్టిన ‘స్విస్ ఛాలెంజ్’ కేసులు ఎప్పటికి పరిష్కారమవుతాయో, రాజధాని నిర్మాణం ఎప్పటికి మొదలవుతుందో ఏమో. ఇదంతా చూస్తుంటే రాజధాని నిర్మాణంపై ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ది ఉందా అన్న అనుమానాలు వస్తున్నాయి. లేకపోతే, వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందేందుకే రాజధాని వ్యవహారాన్ని ప్రభుత్వమే సాగదీస్తోందా అన్నది తెలియటం లేదు.