వివాహిత శ్వేత మృతి కేసు : పోస్టుమార్టం రిపోర్టులో ఏముంది? ఆసక్తిగా మారిన నివేదిక...

విశాఖ ఆర్కే బీచ్ లో వివాహిత శ్వేత అనుమానాస్పద మృతి కేసులో పోస్టుమార్టం నివేదిక మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. అది వెలుగులోకి వస్తేకానీ.. ఆత్మహత్యా, హత్యా అనేది తెలియదు.

swetha death case : What is in the postmortem report? - bsb

విశాఖపట్నం : తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విశాఖ బీచ్ లో యువతి మృతదేహం కేసులో.. పోస్టుమార్టం రిపోర్టులో ఏముందనేది ఆసక్తిగా మారింది. ఆర్కే బీచ్ లో శ్వేత అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆమె మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. విశాఖ మూడో పట్టణ పోలీసులు, రెవెన్యూ అధికారులు శ్వేత మృతదేహానికి శవ పంచానామా నిర్వహించారు. విశాఖపట్నంలోని కేజీహెచ్ మార్చురీలో ముగ్గురు వైద్యుల బృందం పోస్ట్ మార్టం నిర్వహించింది.  

ఈ పోస్ట్ మార్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను డాక్టర్లు పోలీసులకు అందించారు. ఈ నివేదికలో ఏముంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  మొదట శ్వేత మృతిని ఆత్మహత్యగా అనుకున్నారు.  కానీ ఆమె మృతదేహం పడి ఉన్న తీరు అనుమానాస్పదంగా ఉండడంతో.. అనుమానాస్పద మృతిగా కేసును విచారణ చేపట్టారు. విశాఖ మూడో పట్టణ పోలీసుల చేతుల్లో ప్రస్తుతం ఈ పోస్టుమార్టం నివేదిక ఉంది.

శ్వేత మృతిపై పోలీసుల విచారణ ముమ్మరం: కీలకం కానున్న పోస్టుమార్టం రిపోర్టు

 కాగా వివాహిత శ్వేత మృతిలో మరో కీలకమైన అంశం ఆలస్యంగా వెలుగు చూసింది. శ్వేత ఆడపడుచు రమ భర్త సత్యం..ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు శ్వేత తల్లి తన ఫిర్యాదుల పేర్కొంది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆడపడుచు భర్త సత్యం పై లైంగిక వేధింపులు, శ్వేత అత్త, ఆడపడుచుల మీద వరకట్న వేధింపుల కేసులు నమోదు చేశారు.  పోలీసులు ఆ కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

వివాహిత శ్వేత చనిపోయే సమయానికి ఐదు నెలల గర్భిణీ.  ఆమె అనుమానాస్పద మృతి విషయంలో భర్త, అత్తా,మామ, ఆడపడుచులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు  సమాచారం. శ్వేత పోస్టుమార్టం తర్వాత.. అత్తింటి వారంతా పోలీసుల అదుపులోనే ఉండడంతో.. ఆమె మృతదేహాన్ని తల్లి రమ,  బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు గురువారంనాడు కాన్వెంట్ కూడలి దగ్గర్లోని స్మశాన వాటికలో శ్వేత మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.

శ్వేత ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆమె ఇంటి నుంచి ఎటువైపు వెళ్ళిందనే దానిమీద ఆధారాల కోసం పరిశీలిస్తున్నారు. కాగా, బీచ్ రోడ్డులోని  వారు మెమోరియల్ స్తూపం దగ్గర శ్వేత మృతదేహం దొరికింది.  అయితే ఆ స్థూపానికి దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయడం లేదని సమాచారం. అక్కడే కాదు ఆ చుట్టుపక్కల కూడా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలుస్తోంది.  

రద్దీగా ఉండే బీచ్ రోడ్ లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో.. దర్యాప్తు ముందుకు సాగడం లేదు. శ్వేత ఏ సమయంలో ఎక్కడ ఉంది అనే అంశాలపై పోలీసులకు స్పష్టమైన  అవగాహన రావడం లేదు. దీనివల్లే ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేకపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios