చంద్రబాబుకు రిటర్న్‌గిఫ్ట్‌లో భాగంగా తనయుడు కేటీఆర్‌ను జగన్ వద్దకు పంపిన కేసీఆర్ తను కూడా స్వయంగా వైసీపీ అధినేతను ఎప్పుడు కలుస్తారా అని తెలుగు ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్‌హోం కార్యక్రమంలో వీరి భేటీ జరుగుతుందని విశ్లేషకులు సైతం అంచనా వేశారు. కానీ హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమానికి వెళ్లలేదు.

అయితే వచ్చే నెల 14న జగన్ అమరావతిలో నూతనంగా నిర్మించిన ఇంటిలో గృహప్రవేశం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ దీనిపై ఇరు వర్గాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

సరిగ్గా ఇదే సమయంలో వచ్చే నెల 14న కేసీఆర్ విశాఖ వెళ్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. శారదాపీఠంలో ఫిబ్రవరి 14న జరగనున్న అమ్మవారి విగ్రహావిష్కరణ కార్యక్రామానికి హాజరుకావాల్సిందిగా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి.. కేసీఆర్‌ను ఆహ్వానించారు.

ఆయన ఆహ్వానంపై టీఆర్ఎస్ అధినేత సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే జగన్ గృహప్రవేశం రోజున ఆయనకు విశాఖ నుంచి ఆహ్వానం రావడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. శారదా పీఠాధిపతి స్వరూపానందకు కేసీఆర్, జగన్‌లతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

ప్రజా సంకల్పయాత్ర ప్రారంభం కావడానికి ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం జగన్ నేరుగా విశాఖ వెళ్లి స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్నారు. ఇక కేసీఆర్ విషయానికి వస్తే.. ఆయనకు యాగాలు, హోమాలు తదితర ఆధ్యాత్మిక విషయాల్లో స్వరూపానంద సలహాలు ఇవ్వడం తెలిసిందే.

గులాబీ బాస్ ఎన్నికల ప్రచారానికి మందు నిర్వహించిన రాజశ్యామల యాగం స్వరూపానంద ఆధ్వర్యంలోనే జరిగింది. ఆ తర్వాత ఎన్నికల్లో విజయం సాధించడం వెంటనే విశాఖ వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. 

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్, ఏపీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి దూసుకెళ్లాలని భావిస్తున్నారు. ప్రధానంగా ఇద్దరికి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబును ఎలాగైనా దెబ్బ కొట్టాలనే ఉద్దేశ్యంతో ఇద్దరు నేతలు ఉన్నారు.

ఈ క్రమంలో కేసీఆర్‌.. జగన్‌ను కలవాల్సి ఉంది. అయితే గృహ ప్రవేశ కార్యక్రమంలో చర్చలు జరిపితే వేరే సంకేతాలు వెళతాయని భావించిన వీరిద్దరు తమకు అత్యంత ఆప్తులు స్వరూపానంద సరస్వతి సమక్షంలో చర్చలు జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

అమ్మవారి విగ్రహా విష్కరణ సాకుతో తెలంగాణ సీఎంను విశాఖ రప్పించి.. ఆ తర్వాత కొత్తగా అమరావతి నుంచి రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించబోతున్న సమయంలో స్వామి వారి ఆశీస్సులు తీసుకునేందుకు జగన్ విశాఖ చేరుకుంటారని.. అక్కడే ఇద్దరు నేతలు సమావేశమవుతారని విశ్లేషకులు అంచనా. 

లేదంటే ముందుగా అమరావతిలో జగన్‌ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి కేసీఆర్ విశాఖ చేరుకుంటారా..? అన్నది తెలియాల్సి ఉంది. ఇరు పక్షాల నుంచి అధికారిక ప్రకటన వస్తే కానీ ఏది ముందు, ఏది వెనుక అన్నది తెలియదు. ఏదీ ఏమైనప్పటికీ ఇద్దరి భేటీకి మాత్రం స్వరూపానంద కీలకంగా మారే అవకాశం మాత్రం స్పష్టమన్నది విశ్లేషకుల మాట.