అంతర్వేది రథం దగ్ధమైన ఘటనకు సంబంధించి సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి స్వాగతించారు. హిందువుల మనోభావాలతో ముడిపడిన అంతర్వేది ఘటనపై సిబిఐ విచారణకు ఆదేశించడం సాహసోపేతమైన నిర్ణయమన్నారు. సీబీఐ విచారణ ద్వారా అంతర్వేది ఘటన వెనుక ఉన్న అసలు కుట్ర కోణం బయటపడే అవకాశం ఉందని చెప్పారు.

అంతర్వేది రథం దగ్ధం విషయంలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరు అనే విషయాన్ని సి.బి.ఐ నిగ్గు తేలుస్తుందన్నారు. టీటీడీని కాగ్ పరిధిలోకి తీసుకురావాలని తీసుకున్న నిర్ణయం ఓ ఎత్తయితే... దాన్ని తలదన్నే విధంగా ప్రస్తుతం అంతర్వేది ఘటనపై సిబిఐ విచారణకు ఆదేశించడం హిందువులందరూ హర్షించదగ్గ విషయమని స్వామి స్వరూపానందేంద్ర అభిప్రాయపడ్డారు. హిందూధర్మ పరిరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం అభినందనీయమని చెప్పారు.