అమరావతి: స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై రమేష్ ఆస్పత్రి యజమాని డాక్టర్ రమేష్ బాబు తాజాగా స్పందించారు. వైద్య చికిత్సలో కులం, మంతం వంటివాటిని చూడబోమని, కొందరు ప్రజాప్రతినిధులు రమేష్ చౌదరి అని మీడియాలో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. వైద్యం అనేది కులాన్ని అడ్డం పెట్టుకుని పదవులు, వ్యాపారాభివృద్ధి చేయడం కాదని ఆయన అన్నారు. 

కళకు, వైద్యానికి కులం అంటగట్టడం సరి కాదని ఆయన అన్నారు. రిసెప్షన్, కంప్యూటర్ రూంలో సంభవించిన షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు సమాచారం ఉందని ఆయన చెప్పారు. కలెక్టర్ అనుమతితోనే స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కలెక్టర్ కొందరు ఉన్నతాధికారులను చికిత్స కోసం రెఫర్ చేశారని ఆయన చెప్పారు. 

Also Read: స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం: రమేష్ ఆస్పత్రికి వైఎస్ జగన్ ప్రభుత్వం షాక్

హౌస్ కీపింగ్, సౌకర్యాల కల్పన నిర్వహణ బాధ్యత హోటల్ దేనని, పేషంట్ మెడికల్ సర్వీసెస్ రమేష్ ఆస్పత్రి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. హోటల్ నిర్వహణకు సంబంధించిన నైట్ డ్యూటీలో ఉన్నవారిని అరెస్టు చేయకుండా ఆస్పత్రి సిబ్బందిని అవసరమైనప్పుడు విచారణకు పిలువకుండా రిమాండ్ కు పంపడమేమిటని ఆయన అన్నారు. 

ప్రమాదం జరిగిన రోజు తాను కలెక్టరేట్ విచారణకు హాజరైనట్లు తెలిపారు. ఆ తర్వాత డాక్టర్ రాజగోపాల్, సుదర్శన్ లను నిర్బంధించారని, విచారణ నిష్పాక్షికంగా జరగడం లేదని న్యాయ సలహాదారులు చెప్పారని రమేష్ బాబు అన్నారు. అధికారులు విచారణకు పిలిచేవరకు వేచి ఉండాలని సూచించారని ఆయన చెప్పారు.

నిష్పాక్షికమైన విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని, బిల్లింగ్ విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించామని ఆయన చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత రమేష్ బాబు అజ్ఢాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. రమేష్ ఆస్పత్రి స్వర్ణ ప్యాలెస్ లో నిర్వహించిన కోవిడ్ కేర్ సెంటర్ లో అగ్నిప్రమాదం సంభవించి పది మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే.