అమరావతి: తమ చానెల్ ఉద్యోగినితో తాను ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడలేదని ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మెన్ పృథ్వీ‌రాజ్ చెప్పారు. ఈ విషయం విజిలెన్స్ విచారణలో తేలుతుందని పృథ్వీరాజ్ వివరణ ఇచ్చారు.

 ఛానెల్ ఉద్యోగినితో ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మెన్ పృథ్వీరాజ్  అసభ్యంగా మాట్లాడినట్టుగా  సోషల్ మీడియాలో ఆడియో సంభాషణ వైరల్ గా మారింది. ఈ పరిణామాలపై పృథ్వీరాజ్  ఆదివారం నాడు మధ్యాహ్నం ఓ వీడియోను మీడియాకు పంపారు.

Also read:ఉద్యోగినితో పృథ్వీ అసభ్య సంభాషణ: విచారణకు టీటీడీ ఛైర్మెన్ ఆదేశం

చానెల్ ఉద్యోగుల పట్ల తాను ఏ రకంగా వ్యవహరించిందో అందరికీ తెలుసునని చెప్పారు. తాను అందరికి అన్నగానే ఉన్నానని చెప్పారు. తన ఆడియోను మార్ఫింగ్ చేశారని పృథ్వీరాజ్ చెప్పారు.

అన్యమత ప్రచారం గురించి కూడ తప్పుడు ప్రచారం చేశారని ఆయన చెప్పారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనల విషయంలో పృథ్వీ చేసిన ఆరోపణలపై కూడ ఆయన వివరణ ఇచ్చారు.

రాజధాని  రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ తాను అనలేదన్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని పృథ్వీరాజ్ చెప్పారు. తన మాటలకు రైతులు బాధపడినందుకుగాను  తనను క్షమాపణలు చెబుతున్నట్టుగా పృథ్వీ ఆ వీడియోలో వివరించారు.

ఉద్యోగినిని అసభ్యంగా మాట్లాడినట్టుగా ఆడియో సంభాషణ తనకు తలవొంపులు తెచ్చేవిధంగా ఉందన్నారు. తాను పద్మావతి గెస్ట్‌హౌస్‌లో మద్యం సేవించినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని పృథ్వీరాజ్ తెలిపారు.

విజిలెన్స్ విచారణలో  అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. పోసాని కృష్ణమురళి మాదిరిగానే తాను కూడ ముక్కుసూటిగా మాట్లాడుతానని చెప్పారు.పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా తాను ఏనాడూ వ్యవహరించలేదని తెలిపారు.