కాకినాడ: మాజీమంత్రి, టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అచ్చెన్నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎస్వీబీసీ చైర్మన్, సినీనటుడు పృథ్వీరాజ్. కూలికి ఎక్కువ, మేస్త్రీకి తక్కువ అంటూ ధ్వజమెత్తారు. అచ్చెన్నాయుడు లేకపోతే అసెంబ్లీలో మరింత అర్థవంతమైన చర్చ జరిగేదని అభిప్రాయపడ్డారు. 

అసెంబ్లీలో అచ్చెన్న అరుపులు, కేకలు తప్ప ఇంకేమీ లేదన్నారు పృథ్వీరాజ్. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయా అంటూ ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలను ప్రజలు ఆసక్తిగా తిలకించేవారని ప్రస్తుతం ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎదురైందన్నారు. 

మరోవైపు మాజీమంత్రి నారా లోకేష్ చేస్తున్న విమర్శలు వైసీపీకి ఆశీస్సులు మాత్రమేనని చెప్పుకొచ్చారు. లోకేష్ వ్యాఖ్యల వల్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న దిష్టి పోతుందని అన్నారు. ప్రజలు కోరుకుంటున్న రాజన్న రాజ్యం వచ్చేసిందని భవిష్యత్ లో మరింత మంచి పాలన రాబోతుందని పృథ్వీరాజ్ తెలిపారు.