వైసీపీకి 160 సీట్లు వస్తే మిగిలిన 15 సీట్లను మాత్రం ఎందుకు వదిలేసినట్లో. మరి అధికారపక్షలో గెలిచే ఆ 15 మంది ఎవరో.

ఎవరిగోల వారిదే. అదేనండి సర్వేల గోల. ఎవరికి వారు తమకే ప్రజల మద్దతుందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీట్లన్నీ మనవేనని తేలిందని సర్వేలతో ఊదరగొట్టటం ఎక్కువైపోయింది ఏపిలో. అటు అధికార తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్రంలోని మొత్తం సీట్లన్నీ తమవేనని గట్టిగా చెబుతోంది. నిజమేనేమో అన్నట్లుగా టిడిపి నేతలు సర్వేల వివరాలతో కలిపి మీడియాకు చెబుతున్నారు.

 తాజాగా, వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమకు 160 సీట్లు వస్తాయని సర్వేల్లో తేలినట్లు చెబుతున్నారు. పోయిన ఎన్నికల్లో అన్నీ పార్టీలకు కలిపి 45 శాతం ఓట్లు వస్తే ఒక్క తమ పార్టీకి మాత్రమే 44 శాతం ఓట్లు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. పైగా కేవలం ఒక్క శాతం ఓట్ల తేడాతోనే టిడిపి అధికారంలోకి రాగలిగినట్లు చెప్పారు.

ఆయన చెప్పినట్లు ఓట్ల శాతం ఒక్కటే అయి ఉండవచ్చు.కానీ సీట్ల తేడా ఎంత? వైసీపీకి వచ్చిన సీట్లు 67 అయితే, అధికార పక్షమైన టిడిపి, భాజపాలకు వచ్చింది 108 సీట్లు అన్న విషయాన్ని రెడ్డి మరచిపోయినట్లున్నారు. సీట్లలో ఉన్న తేడా వల్లే కదా ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు వైసీపీని ఒక రేంజిలో ఆడుకుంటున్నది.

ప్రస్తుతానికి వస్తే టిడిపి దాని బంధ పార్టీల ఓట్లశాతం 45 నుండి 15 శాతానికి తగ్గిపోయినట్లు తమ సర్వేల్లో తేలిందన్నారు. అదే సమయంలో వైసీపీ ఓట్లశాతం మరింత పెరిగిందని మాత్రమే చెప్పారు. ఎంతకి పెరిగిందో మాత్రం చెప్పలేదు. బహుశా అది సీక్రెట్ ఏమో. తాము చేయించుకున్న సర్వే ఎవరితో చేయించారో చెప్పలేదు. సర్వే బాధ్యతలు ఏదైనా సంస్ధకు అప్పగించారా? లేక పార్టీనే చేసిందా? లేకపోతే తమ మీడియా సాక్షితో చేయించారా అన్న విషయాన్ని కూడా రెడ్డి చెబితే బాగుండేది. అదే విధంగా సర్వే సమయంలో ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారో కూడా చెప్పలేదు.

ఇక, చంద్రబాబును చూస్తేనేమో మొత్తం ప్రజల్లో 98 శాతం మంది ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నింటినీ భేష్ అని ప్రజలు కితాబులిస్తున్నట్లు ప్రతీ వేదికపైనా చంద్రబాబు ఊదరగొడుతున్నారు. మరి విజయసాయేమో అధికార పక్షానికి ప్రజలు ఆధరణ 15 శాతానికి పడిపోయిందని అంటున్నారు.

వైసీపీకి 160 సీట్లు వస్తే మిగిలిన 15 సీట్లను మాత్రం ఎందుకు వదిలేసినట్లో. మరి అధికారపక్షలో గెలిచే ఆ 15 మంది ఎవరో. ఇద్దరిలో ఎవరి వాదన కరెక్టో తెలీక జనాలు జుట్టు పీక్కుంటున్నారు. ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్ళుండగానే ఈ సర్వేల గోల ఈ విధంగా ఉంటే ఎన్నికలు దగ్గర పడేకొద్దీ ఇంకెత రేంజిలో ఉంటుందో.