న్యూఢిల్లీ: వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ మీద ఈ రోజు శుక్రవారం విచారణ జరగనుంది. తనకు బెయిల్ ఇవ్వాలంటూ రఘురామ కృష్ణమ రాజు సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన దాఖలు చేశారు. రఘురామ కృష్ణమ రాజుకు సికింద్రాబాదులోని ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. 

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రఘురామ కృష్ణమ రాజుకు సికింద్రాబాదు ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరిగాయి. ముగ్గురు వైద్యుల బృందం తెలంగాణ హైకోర్టు నియమించిన జ్యుడిషియల్ అధికారి నాగార్జున పర్యవేక్షణలో ఆ పరీక్షలు జరిగాయి. తమ నివేదికను వైద్యులు సీల్డ్ కవర్ లో అందించారు. ఆ సీల్డ్ కవర్ ను తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టుకు పంపించింది.

రఘురామ కృష్ణమ రాజుకు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికపైనే ఉత్కంఠ నెలకొంది. సిఐడి కస్టడీలో తనను చిత్రహింసలు పెట్టారని, తనను కొట్టారని రఘురామ కృష్ణమ రాజు కోర్టుకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనూ గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలోనూ వైద్య పరీక్షలు నిర్వహించి, నివేదికలను తమకు అందించాలని కింది కోర్టు ఇదివరకు ఆదేశించారు.

గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు చేయించిన సిఐడి అధికారులు రమేష్ ఆస్పత్రికి తరలించలేదు. రఘురామ కృష్ణమ రాజును ఎవరూ కొట్టలేదని జీజీహెచ్ వైద్య బృందం నివేదిక తేల్చింది. దీంతో వ్యవహారం సుప్రీంకోర్టుకు ఎక్కింది. రమేష్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలనే రఘురామ కృష్ణమ రాజు తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ అభ్యర్థనను సిఐడి తరఫు న్యాయవాది దుష్యంత్ దవే వ్యతిరేకించారు. దీంతో సికింద్రాబాదు ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

దాంతో గుంటూరు జిల్లా జైలు నుంచి రఘురామ కృష్ణమ రాజును సికింద్రాబాదు ఆర్మీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణమ రాజుకు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలావుంటే, రఘురామ కృష్ణమ రాజుకు బెయిల్ ఇవ్వకూడదని సిఐడి కౌంటర్ దాఖలు చేసింది.