ఫైబర్ నెట్ కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ వాయిదా..
ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.
ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్‌పై విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టుగా సుప్రీం కోర్టు తెలిపింది. అప్పటివరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని సూచించింది. వివరాలు.. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై, ఫైబర్ నెట్ కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌లపై న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించాల్సి ఉంది.
అయితే మధ్యాహ్నం రెండు గంటలకు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై వాదనలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు ప్రారంభించారు. సెక్షన్ 17ఏకు సంబంధించి రోహత్గీ సుదీర్ఘంగా వాదనలు వినిపిస్తున్న సమయంలో జోక్యం చేసుకున్న చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్ సాల్వే.. వాదనలు పూర్తి చేయాలని, ఇప్పుడు సమయం మధ్యాహ్నం 3 గంటలు అవుతుందని చెప్పారు. ఇందుకు రోహత్గీ స్పందిస్తూ.. కోర్టు 4 గంటల వరకు ఉంటుందని అన్నారు.
ఇందుకు సాల్వే స్పందిస్తూ.. అప్పటివరకు వాదనలు వినిపిస్తారా? ఇది సరికాదని అన్నారు. ఈ క్రమంలోనే తాను మరో 10 నిమిషాలలో పూర్తి చేస్తానని రోహత్గీ అన్నారు. ఈ క్రమంలోనే క్వాష్ పిటిషన్ తర్వాత మరో పిటిషన్ (ఫైబర్ నెట్ స్కామ్‌లో ముందస్తు బెయిల్) పెండింగ్‌లో ఉందని చంద్రబాబు తరఫు న్యాయవాది లూథ్రా అన్నారు. ఆ సమయంలో సాల్వే స్పందిస్తూ.. తనకు అరగంట సరిపోతుందని, లూథ్రా మరో విషయంపై వాదించడానికి 30 నిమిషాల సమయం ఇవ్వాలనుకుంటున్నానని చెప్పారు.
అయితే ఈ క్రమంలోనే స్పందించిన జస్టిస్ త్రివేది.. ఆ పిటిషన్‌పై మరోక రోజు విచారణ చేపట్టాలని అనుకుంటున్నట్టుగా చెప్పారు. ప్రస్తుతం క్వాష్ పిటిషన్‌పై విచారణను పూర్తి చేద్దామని అన్నారు. ఫైబర్ నెట్ స్కామ్ కేసు అంశాన్ని శుక్రవారం పోస్ట్ చేస్తామని చెప్పారు. అదే సమయంలో చంద్రబాబును అరెస్ట్ చేయవద్దనే అభ్యర్థనను కోర్టు విచారణ జరిగే వరకు పొడిగించాలని ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోరారు. దీంతో అప్పటివరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దనే అభ్యర్థను అంగీకరించాలని సుప్రీం కోర్టు సూచించింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టుగా తెలిపింది.