బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట.. అప్పటివరకు ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ లేనట్టే..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టులో ఊరట కలిగింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టులో ఊరట కలిగింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్‌ను నవంబర్ 20న విచారణ చేపడతామని న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం తెలిపింది. తాము ఇందుకు సంబంధించి పూర్తిగా వాదనలు వినాల్సి ఉందని పేర్కొంది. ఈలోగా కవితను విచారణకు పిలవొద్దని ఈడీని ఆదేశించింది.
ఈ క్రమంలోనే నవంబర్ 20న కవిత పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారించే వరకు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమెకు సమన్లు ఇవ్వబోమని ఈడీ సుప్రీం ధర్మాసనానికి తెలిపింది. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత నవంబర్ 20 వరకు ఈడీ విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజుల్లోనే షెడ్యూల్ వస్తుందని భావిస్తున్న వేళ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇది కవితకు లభించిన ఊరటగా భావిస్తున్నారు. ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ తనకు జారీ చేసిన సమన్లకు వ్యతిరేకంగా కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.