అమరావతి: టీడీపీ ప్రభుత్వం హయంలో అమరావతి భూ కుంభకోణంపై  రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై సుప్రీంకోర్టులో గురువారం నాడు విచారించింది.

ఈ విషయమై ఏపీ హైకోర్టు విధించిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.ఈ విషయమై కేసు దర్యాప్తులో హైకోర్టు స్టే విధించడం సరైంది కాదని ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదించారు.

మంత్రివర్గ సిఫారసుల ఆధారంగా సిట్ ఏర్పాటైందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలు లేవని ఆయన సుప్రీంకు తెలిపారు.

టీడీపీ ప్రభుత్వ హయంలో అమరావతి భూకుంభకోణంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని...ఈ విషయమై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రానికి కూడ లేఖ రాసిన విషయాన్ని ధవే సుప్రీంకోర్టుకు చెప్పారు.

టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలన్నింటిపై దర్యాప్తు చేస్తారా... అని  కోర్టు ప్రశ్నించింది. అయితే అలాంటిదేమీ లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది వివరించారు.అక్రమాలు చోటు చేసుకొన్న విషయాలపైనే సిట్ దర్యాప్తు చేస్తోందని చెప్పారు. సిట్ దర్యాప్తు విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోవద్దని ఆయన కోరారు.

ఆర్టికల్ 226 ప్రకారంగా సిట్ దర్యాప్తుపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వ్యక్తిగతంగా ప్రభావితమైతే తప్ప ఆర్టికల్ 226 ప్రకారం రిట్ దాఖలు చేయలేరన్నారు. సిట్ దర్యాప్తుతో ఎలాంటి సంబంధం లేనివారు పిటిషన్లను దాఖలు చేశారు. హైకోర్టుకు అసాధారణ అధికారాలు లేవు. సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి పనిచేయాల్సిందేనని దుష్యంత్ ఈ సందర్భంగా చెప్పారు.

ఈ కేసులో టీడీపీ నేతలు వర్ల రామయ్య తో పాటు ప్రతి వాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.