కరోనా నేపథ్యంలో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఏపీ ఉద్యోగుల జీతాల చెల్లింపు అంశానికి సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

మార్చి, ఏప్రిల్‌లో 50 శాతం జీతాల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వ జీవోను కొట్టేస్తూ బకాయిలను 12 శాతం వడ్డీతో 2 నెలల్లోగా చెల్లించాలని ఆగస్టులో ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.

అయితే హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కరోనా సంక్షోభంతో ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నందున వడ్డీ చెల్లించలేమని ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి దృష్టికి తీసుకొచ్చింది.

దీనిపై జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. 12 శాతం వడ్డీ చెల్లించాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ విచారణ వాయిదా వేసింది.