న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజుకు ఊరట లభించింది. ఆయన సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జార చేసింది. విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆయనను ఆదేశించింది. 

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని, మీడియా ముందుకు రావద్దని కూడా ఆదేశించింది. మీడియా సమావేశాలు పెట్టవద్దని రఘురామను ఆదేశించింది. విచారణకు 24 గంటల ముందు రఘురామకు నోటీసు ఇవ్వాలని సుప్రీంకోర్టు సిఐడిని అదేశించింది. న్యాయవాదుల సమక్షంలో రఘురామను విచారించాలని ఆదేసించింది. 

Also Read: రఘురామకే కాదు, కంగనాకు కూడా వై కెటగిరీ భద్రత: సుప్రీంలో దుష్యంత్ దవే

ఈ కేసు గురించి ఏమీ మాట్లాడవద్దని సుప్రీంకోర్టు రఘురామ కృష్ణమ రాజును ఆదేశించింది. కస్టడీలోకి తీసుకుని రఘురామను విచారించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.ఈ కేసులో ఇప్పటికే విషయాలు రికార్డు అయి ఉన్నాయని చెప్పింది. 

ఇరు పక్షాల మధ్య శుక్రవారం సుప్రీంకోర్టులో వాడి వేడి వాదోపవాదాలు జరిగిన విషయం తెలిసిందే. గతంలో మాదిరిగా గాయాలను చూపించవద్దని, అలా చేస్తే కఠినమైన చర్యలుంటాయని ఆదేశించింది. లక్షల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు మరో ఇద్దరు లక్ష రూపాయలేసి పూచీకత్తును సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పది రోజుల్లోగా పూచీకత్తులు ట్రయల్ కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

రఘురామ చేసిన ప్రకటనలు వీడియో ద్వారా తెలిశాయి కాబట్టి కస్టడీకి అవసరం లేదని చెప్పింది. ఏడాది క్షుణ్నంగా పరిశీలించి, దర్యాప్తు చేసిన తర్వాతనే కేసు నమోదు చేశామని సిఐడి చెప్పింది కాబట్టి కూడా కస్టడీ అవసరం లేదని చెప్పింది.

రఘురామ పట్ల సిఐడి పోలీసులు సరిగా వ్యవహరించలేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కేసును సిబిఐకి అప్పగించాలనే రఘురామ కృష్ణమ రాజు తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు పట్టించుకోలేదని భావించవచ్చు. రఘురామ కృష్ణమ రాజుపై దర్యాప్తు చేయడానికి సిఐడికి అవకాశం కూడా ఉంది. కుట్రకోణంపై సిఐడి దర్యాప్తు కొనసాగించే వెసులుబాటు కలిగింది. అందుకు రఘురామ కృష్ణమ రాజు సహకరించాల్సి ఉంటుందనే విషయం సుప్రీంకోర్టు ఆదేశాలను బట్టి అర్థమవుతోంది.