ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ డియోధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ బెయిల్‌పై తిరుతున్నారని చెప్పారు.

అయితే ఏ క్షణమైనా జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశం వుందని సునీల్ డియోధర్ వ్యాఖ్యానించారు. బెయిల్‌పై వున్న వ్యక్తి రాష్ట్రానికి సీఎంగా కొనసాగుతున్నారని.. ఏపీలో రౌడీరాజ్యం నడుస్తోందని సునీల్ ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు కూడా జైలుకు వెళ్తాడని ఆయన జోస్యం చెప్పారు. 

కాగా, రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడారు సునీల్ . ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉత్తరప్రదేశ్, బిహార్, త్రిపుర రాష్ట్రాల్లో ఏవిధంగా గుండాయిజాన్ని అంతమొందించామో, అదేవిధంగా బీజేపీ- జనసేన ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న గుండాయిజాన్ని కూడా అంతమొందిస్తామని సునీల్ దియోధర్ వ్యాఖ్యానించారు. 

సునీల్ దియోధర్ కామెంట్స్‌ను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేయగా.. దీనిపై వైసీపీ, టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఏయే రాష్ట్రాల్లో గూండాయిజం ఉందో ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ చురకలు వేశారు.