తెలుగుదేశంపార్టీ లాలూచీ రాజకీయాలు బయటపడ్డాయి. అదికూడా చంద్రబాబునాయుడు నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లోనే కావటం పార్టీలో సంచలనంగా మారింది. ప్రతీ రోజు లాగే, శుక్రవారం ఉదయం కూడా చంద్రబాబు నేతలతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఎంపిలు, మంత్రులు, కీలక నేతలు పలువురు కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.

లోక్ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టటం, పట్టిసీమ నిధుల దుర్వినియోగం, సిబిఐ విచారణ లాంటి విషయాలు అనేకం చర్చకు వచ్చాయి. అటువంటి సమయంలోనే ఊహించని విధంగా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి రెండు రుల క్రితం కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి అరుణ్ జైట్లీతో రహస్యంగా భేటీ విషయం బయటపడింది. వింటున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

అదికూడా జైట్లీ-సుజనా భేటీ విషయాన్ని బయటపెట్టింది మంత్రి యనమల రామకృష్ణుడు కావటం విశేషం. యనమల విషయాన్ని బయటపెట్టేంత వరకూ చాలామందికి ఈ విషయం తెలియదట. ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత టిడిపి ప్రతిపక్షమే. అందుకనే కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నారు. ఇటువంటి సమయంలో జైట్లీ-సుజనా భేట వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

భేటీ విషయాన్ని యనమల ప్రస్తావించినా సుజనా భేటీ విషయాన్ని అంగీకరించారు. అయితే వివరాల విషయంలో పెద్దగా స్పందించలేదని సమాచారం. దాంతో ఈ విషయమై పార్టీలోని నేతలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. జైట్లీతో సుజనా భేటీ కావటం చంద్రబాబుకు తెలీకుండా జరగదని కొందరు నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తరపున సుజనా కేంద్రమంత్రిని కలిసుండచ్చని కూడా అనుమానిస్తున్నారు.

సరే, విషయం ఏదైనా కేంద్రంతో లాలూచీ రాజకీయాలు చేస్తున్నది ఎవరన్న విషయం ఈరోజు టెలికాన్ఫరెన్సులో బయటపడింది.