విశాఖపట్నం: తన పాత బాస్ అయిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అండగా నిలిచారు. సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీని వీడి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు 

ముఖ్యమంత్రి జగన్ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని సుజనా చౌదరి అన్నారు. చంద్రబాబుపై కక్ష సాధింపే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయని ఆయన అన్నారు. అక్రమాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు 

రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ ప్రభుత్వం జిమ్మిక్కులు చేస్తోందని విమర్శించారు. మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బిజెపిని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని సుజనా చౌదరి చెప్పారు. 

చంద్రబాబును లక్ష్యం చేసుకుని వైసిపి రాజకీయాలు చేస్తోందని టీడీపీ నేత బోండా ఉమ విమర్శించారు హైసెక్యూరిటీ జోన్ లోకి డ్రోన్లు ఎలా వచ్చాయని ఆయన అడిగారు. ఫిర్యాదు చేసేందుకు డీజీపి అపాయింట్ మెంట్ దొరకలేదని అన్నారు. 

ఐజిని కలిసి ఫిర్యాదు చేస్తామని బొండా ఉమా చెప్పారు. భారీ వరదలు వచ్చినా గతంలో ఫ్లడ్ మానిటరింగ్ చేసినట్లు ఆయన తెలిపారు. గతంలో 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పటికీ లంక గ్రామాలు మునగలేదని అన్నారు