కేంద్ర శాస్త్ర సాంకేతిక  శాఖ మంత్రి సుజనా చౌదరి ఒక ఆసక్తి కరమయిన విషయం వెల్లడించారు. తమాషా ఎంటంటే ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా తెలియదు. ఆయన ఈ రోజు కర్నూలు లో విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ అవినీతిలేని రాష్ట్రమని చెప్పారు.

 

ఆయన కర్నూలు లోక్ సభ నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ చార్జ్ గా నియమితులయిన సంగతి తెలిసిందే. ఈ  పనిమీద ఆయన ఈ రోజు కర్నూలు కొచ్చారు.

 

ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పరిపాలనకు కితాబు ఇస్తూ రాష్ట్రంలో అవినీతి లేనేలేదని, గత మూడేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి లేని పరిపాలన అందించారని తెగ పొగిడారు.

 

నిజాయితీతో కూడిన పాలన అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కఠినంగా వ్యవహరిస్తూ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నారని, అవినీతిని రూపుమాపారని చెప్పారు. ‘గత మూడేళ్ల కాలంలో ఎక్కడా ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన కుమారుడు మంత్రి లోకేష్‌ పనితీరు బాగుంది. అద్భుతమైన పాలనతో ముందుకు సాగుతుండటాన్ని ఓర్చుకోలేక ప్రతిపక్ష వైసీపీ వ్యక్తిగత విమర్శలు చేస్తూ అసభ్యకర ప్రచారానికి తెర లేపింది,’ అని  సుజనా ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

మరొక ఆసక్తికరమయిన విషయం.

 

 వైసిసి ఈ మధ్య తెలుగుదేశం మీద తీవ్రంగా విరుచకు పడటానికి కారణం జగన్ చేయించిన ఒకసర్వే అని చెప్పారు.

 

‘ఇటీవల సీఎం చంద్రబాబు పనితీరుపై వైసీపీ సర్వే నిర్వహించింది. ప్రజల చంద్రబాబు పాలన మీద సంతృప్తి వ్యక్తం చేశారు.

 

దీనితో  జగన్‌ దిక్కుతోచని స్థితిలో పడ్డారు.  ఏం చేయాలో తెలియక తన కిరాయిమూకలతో విమర్శలు చేయుస్తున్నాడు.’ అనిఅన్నారు.

 

ఆంధ్ర ప్రదేశ్ అవినీతి ఎక్కువగా అందని సర్వేలలో వచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి కూడా ప్రస్తావించారు.

అంతాబాగుంది కాని,  ఈ మధ్య సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే సంస్థ దేశంలోని రాష్ట్రాలలో అవినీతి మీద సర్వేచేయించిది.  ఇది జరిగి నెలరోజులే అయింది. ఆ సర్వే ప్రకారం దేశంలో అవినీతిలో కర్నాటక నెంబర్ వన్, ఆంధ్రప్రదేశ్ నెంబర్ టూ అని వచ్చింది.  ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉండే చానెళ్లు, న్యూస్ పేపర్లు ఈ వార్తను ప్రచురించాయి. కేంద్రమంత్రి పేపర్లు చదవడం, టివి వార్తలు వినడం చేయడా.

 

మరొక నాలుగయిదు నెలలకిందట దేశంలోనే  ఆర్థిక రంగ పరిశోధనలో మేటిదయిన ఎన్ సి ఎ ఇఆర్  అనే సంస్థ జరిగిన సర్వేలలోకూడా ఆంధ్రప్రదేశ్ మోస్ట్ కరప్ట్ స్టేట్ అనిపించుకుంది. ఇదంతా గత మూడేళ్ల ముచ్చటే. కర్నూలోళ్ల చెవిలో సుజనాచౌదరి పూలు పెడుతున్నాడు.