విద్యార్ధుల చదువు, సిలబస్ తదితరాల విషయంలో కళాశాల యాజమాన్యమే ఒకసారి పునరాలోచించుకుంటే మంచిదేమో.
ఒత్తిళ్ళకు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్ధుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. విద్యాలయాల్లోనో లేదా కళాశాలల్లోనో సిలబస్ ఒత్తిడి ఎక్కువగా ఉందని, లేదా మార్కులు, ర్యాంకుల కోసమో కారణమేదైనా గానీ ఒత్తిళ్ళకు బలి అవుతున్నది మాత్రం అభం శుభం తెలియని విద్యార్ధులే అన్నది వాస్తవం. తాజాగా తిరుపతికి సమీపంలోని రేణిగుంటలో ఒక కార్పొరేట్ కళాశాల విద్యార్ధి కమలేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. చదువు విషయంలో కళాశాల ఒత్తిళ్ళకు తట్టుకోలేకే కమలేష్ తనువు చాలించినట్లు సహచర విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.
షరా మామూలుగానే ఘటనను యాజమాన్యం కప్పి పెట్టేందుకు ప్రయత్నాలు చేసింది. అయితే, విద్యార్ధులంతా కలిసి రాత్రే రచ్చ చేయటంతో విషయం బయటకు పొక్కింది. సరే పోలీసుల జోక్యం, కేసు నమోదు ఇవ్వనీ మామూలే. అయితే, కళాశాల యాజమన్యంపై చర్యలు తీసుకునే దమ్ము మాత్రం పోలీసులకే కాదు ప్రభుత్వానికి కూడా లేదని ఎన్నో మార్లు రుజవైంది. ఎందుకంటే, కళాశాల యాజమాన్యం ప్రభుత్వంలో కీలక శాఖను నిర్వహిస్తున్న మంత్రిది కావటమే.
పైగా సదరు మంత్రికి మరో మంత్రి స్వయానా వియ్యంకుడు కావటం కూడా బాగా కలసి వచ్చింది. దాంతో రాష్ట్రంలో సదరు కళాశాలలో ఏమి జరిగినా ఉన్నతాధికారులు ఎవరూ ప్రశ్నించే సాహసం కూడా చేయటం లేదు. అటు ఉన్నతాధికారులూ అడగక, ఇటు పోలీసులూ కేసును దర్యాప్తు చేయలేకపోతుంటే ఇక కళాశాల యాజమాన్యానికి హద్దేముంటుంది.
గడచిన రెండున్నరేళ్ళలోనే కనీసం ఇదే కళాశాలలో చదవిన విద్యార్ధులు సుమారు 12 మంది మరణించారు. ప్రతీసారీ పెద్ద వివాదమవటం, ఆ తర్వాత సమసి పోవటం మామూలైపోయింది. అయితే, విద్యార్ధుల బలవన్మరణాలు మాత్రం ఆగటం లేదు. ప్రభుత్వం ఏమి చేస్తుందో ఏమో గానీ విద్యార్ధుల చదువు, సిలబస్ తదితరాల విషయంలో కళాశాల యాజమాన్యమే ఒకసారి పునరాలోచించుకుంటే మంచిదేమో. అదే సమయంలో ఇంకో విషయం కూడా ఆలోచించాలి. ఒక కళాశాలలో సుమారు వెయ్యి మంది విద్యార్ధులుంటే కేవలం ఒకరిద్దరు మాత్రమే ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు?
