ప్రభుత్వ ఉద్యోగులు అన్నాక... ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ కావడం చాలా కామన్ . దీనిని పెద్దగా ఎవరూ సీరియస్ గా తీసుకోరు. అయితే... ఓ పాఠశాలలో మాత్రం ప్రిన్సిపల్ మేడమ్ బదిలీ అవుతుంటే... స్కూల్లోని విద్యార్థునులంతా కన్నీరు పెట్టుకున్నారు. మీరు ఎక్కడికీ వెళ్లొద్దు... ఇక్కడే ఉండండి మేడమ్ అంటూ వేడుకున్నారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా రామగిరి మండలం నసనకోటలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... సంగీతకుమారి అనే ఉపాధ్యాయురాలు 2015 నుంచి ఈ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నారు. కాగా.. ఆమెకు ఇటీవల వేరే ప్రాంతానికి బదిలీ అయ్యారు. నూతనంగా వచ్చిన ప్రిన్సిపాల్‌కు బాధ్యతలు అప్పగించేందుకు మంగళవారం పాఠశాలకు విచ్చేశారు. దీంతో ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టిన విద్యార్థినులు బదిలీపై వెళ్లొద్దంటూ కన్నీరు పెట్టుకున్నారు.

 ‘మీరు బదిలీపై వెళ్లొద్దు. మాతోనే ఉండండి. అవసరమైతే మేం అధికారులతో మాట్లాడతాం. మీరు లేకపోతే మాకు ఎంతో బాధగా ఉంది’ అంటూ వేడుకున్నారు. విద్యార్థినుల ఆప్యాయత చూసి సంగీతకుమారి కూడా కన్నీటి పర్యంతమయ్యారు.
 
ప్రిన్సిపాల్‌గా సంగీతకుమారి పనిచేసినంత కాలం విద్యార్థులను తమ తల్లిదండ్రుల కంటే బాధ్యతగా చూసుకునేవారు. చదువుతో పాటు క్రీడలు, సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం వంటి వాటిల్లో శిక్షణ ఇప్పించారు. బాలికలను అన్ని విషయాల్లోనూ ప్రోత్సహించేవారు. అందుకే ఆమెతో వాళ్లకు బంధం ఎక్కువగా బలపడింది. ఈ నేపథ్యంలో ఆమె బదిలీపై వెళ్లడం వాళ్లను కలచివేసింది.