గోడకు అతికించిన సీఎం జగన్ స్టిక్కర్ చించేసిన కుక్కపై అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలంటూ విజయవాడ తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు పోలీసులకు పిర్యాదు చేసారు. 

అమరావతి : ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఏపీలోని అధికార వైసిపితో పాటు ప్రతిపక్షాలు ప్రజల వద్దకు వెళుతున్నాయి. ఇప్పటికే వైసిపి గడపగడపకు కార్యక్రమంతో ప్రజాప్రతినిధులను ప్రజల్లోకి పంపిన జగన్ తాజాగా 'మా నమ్మకం నువ్వే జగనన్న' కార్యక్రమం ద్వారా వైసిపి నాయకులు, కార్యకర్తలను రంగంలోకి దింపారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకుని జగన్ ఫోటోతో కూడిన స్టిక్కర్ ఆ ఇంటికి గృహసారధుల పేరిట ఎంపికచేసిన వైసిపి నాయకులు అతికిస్తున్నారు. అయితే ఇలా ఓ గోడకు అతికించిన జగన్ స్టిక్కర్ ను ఓ కుక్క నోటితో కరిచి తొలగించడం రాజకీయ దుమారం రేపుతోంది.

ముఖ్యమంత్రి జగన్ స్టిక్కర్ ను తొలగించిన కుక్కపై కేసులు పెట్టాలంటూ ప్రతిపక్ష టిడిపి నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళలు ఓ అడుగు ముందుకేసి స్టిక్కర్ చించేసి సీఎం జగన్ ను అవమానించిన కుక్కను జైల్లో పెట్టాలంటూ పోలీసులను ఆశ్రయించారు. గౌరవ సీఎంను ఎవరు అవమానించినా ఊరుకోవద్దని... అది మనుషులైనా, జంతువులైనా...! అంటూ తెలుగు మహిళలు సెటైరికల్ కామెంట్స్ చేసారు. 

Read More జగన్ స్టిక్కర్లు షర్మిల, సునీత ఇళ్లకు అతికించే దమ్ముందా?: వంగళపూడి అనిత

నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ నేతృత్వంలో మహిళలు పీఎస్ కు చేరుకుని జగన్ ఫోటోతో కూడిన స్టిక్కర్లు చించిన కుక్కపై ఫిర్యాదు చేసారు. ఫిర్యాదుతో పాటు స్టిక్కర్ చించుతున్న కుక్క వీడియోను కూడా పోలీసులకు అందించారు. తమ నాయకుడు బోండా ఉమ ఆదేశాలతోనే ఈ ఫిర్యాదు చేసినట్లు ఉదయశ్రీ తెలిపారు. 

వీడియో

151 సీట్లు గెలుచుకున్న ప్రియతమ నాయకుడు జగన్ ను కుక్క అవమానించడం చాలా బాధాకరం... ఈ ఘటన రాష్ట్ర ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిందంటూ ఉదయశ్రీ సెటైర్లు వేసారు. ఇలా కుక్క కూడా సీఎంను చిన్నబుచ్చుకునేలా ప్రవర్తించడం ఎంతో బాధపెడుతోందని అన్నారు. రాష్ట్ర మహిళలు జగన్ ను చాలా గౌరవిస్తారు... అందువల్లే ఆయనకు ఎక్కడా అవమానం జరగొద్దని కోరుకుంటున్నామని అన్నారు. సోషల్ మీడియాలో కుక్క జగన్ స్టిక్కర్లు చించేస్తున్న వీడియో వైరల్ గా మారిందని... వెంటనే సదరు బ్లాక్ డాగ్ పై కేసు నమోదు చేయాలని మహిళలు కోరారు. 

నాలుగుకోట్ల ఆంధ్రులు గౌరవించే సీఎం ను అవమానించిన కుక్కను వెంటనే పట్టుకోవాలని తెలుగు మహిళలు డిమాండ్ చేసారు. విచారణ జరిపి కుక్క వెనకాల వున్న కుక్కలను కూడా తీసుకువచ్చి జైల్లో పెట్టాలని కోరారు. ప్రతిపక్షాలను బెదిరించినట్లే ఇప్పుడు ఈ కుక్కపైనా అటైంప్ట్ మర్డర్ కేసు పెడతారా? అంటూ ఎమ్మెల్యే మల్లాది విష్ణును నిలదీసారు. ఇలా జగన్ స్టిక్కర్ ను చించిన కుక్కపై పోలీస్ స్టేషన్ కు వెళ్లి తెలుగు మహిళలు కంప్లైంట్ చేస్తూ సెటైర్లు వేయడం రాజకీయ చర్చకు దారితీసింది.

ఇక ఇప్పటికే టిడిపి నాయకులు కుక్క జగన్ స్టిక్కర్ చించేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. టిడిపి అధికారిక ట్విట్టర్ లో కూడా ఈ వీడియోను పోస్ట్ చేసారు. ఇప్పుడు ఈ కుక్క మీద కూడా రకరకాల కేసు బుక్ చేసి కోర్టులకు తిప్పి బతకనివ్వకుండా చేస్తారేమో అంటూ సెటైరికల్ కామెంట్ జత చేసారు.