Asianet News TeluguAsianet News Telugu

చనిపోయడని యువకుడికి అంత్యక్రియలు.. చిన్నకర్మ రోజు ఇంటికి వచ్చిన కొడుకు...ఏం జరిగిందో తెలియక...

ఓ యువకుడు చనిపోయాడని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. చిన్న కర్మకు సిద్ధం చేసుకుంటున్నారు. ఇంతలో ఆ వ్యక్తి ఇంటికి తిరిగి వచ్చాడు. దీంతో ఏం జరిగిందో తెలియక కుటుంబసభ్యులు అయోమయంలో పడ్డారు. 

strange incident in nellore district, andhrapradesh
Author
First Published Oct 24, 2022, 8:38 AM IST

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా : తమ బిడ్డ తిరుగిరాని లోకాలకు వెళ్ళిపోయాడని ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. గుండెలవిసేలా రోదించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కలిసి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నకర్మ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతలోనే ఆ యువకుడు గ్రామంలో ప్రత్యక్షమయ్యాడు. నేరుగా ఇంటికి వెళ్లగా కంగు తినడం గ్రామస్తులు, కుటుంబ సభ్యుల వంతయింది. అప్పటివరకు తీవ్ర దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు తమ బిడ్డను చూడగానే వారి ఆనందానికి అవధులు లేకుండాపోయింది. 

ఈ ఘటన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మణుగూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…  మనుబోలు మండలం వడ్లపూడి గ్రామ సర్పంచ్ పల్లేటి రమాదేవి కుమారుడు సతీష్ (34) డిగ్రీ  చదివాడు. అవివాహితులైన సతీష్ కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మతిస్థిమితం సరిగా లేకపోవడంతో చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాత్రికి ఇంటికి రాకపోవడంతో  తల్లి రమాదేవి.. మనుబోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

కాగా శనివారం ఉదయం వెంకటాచలంలోని కనుపూరు చెరువులో  గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. దీంతో పోలీసులు  సతీష్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం బాగా ఉబ్బి,  గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. మృతుడు లావుగా ఉండటం,  చేతికి కట్టుకుని ఉండడంతో  తమ కుమారుడేనని  రమాదేవి  పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు  మృతుడు సతీష్ గా గుర్తించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. మృతదేహాన్ని గ్రామానికి తీసుకువెళ్ళిన కుటుంబ సభ్యులు, బంధువులు శనివారం సాయంత్రం అంత్యక్రియలు పూర్తి చేశారు. 

సినిమా ఫక్కీలో.. సివిల్ సప్లయిస్ ఆఫీసర్నంటూ సోదాలు.. బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడ్డ కీలేడి.

చిన్నకర్మ క్రతువు చేసేందుకు అన్ని ఏర్పాట్లు  చేస్తున్నారు.  ఇంతలో ఆదివారం మధ్యాహ్నం  సతీష్ ఇంటికి చేరుకున్నాడు. దీంతో గ్రామస్తులు, కుటుంబసభ్యులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.  ఏం జరిగిందో తెలియక అయోమయంలో ఉండిపోయారు. తేరుకుని  ఏం జరిగిందని సతీష్ ను ఆరా తీశారు. తాను టూ వీలర్ పై కావలి వెళ్లానని, పెట్రోల్ అయిపోవడంతో బైక్ అక్కడే పెట్టి బస్సులో వచ్చానని చెప్పాడు. సతీష్ మరణించలేదని తెలియడంతో కుటుంబ సభ్యులు ఆనందంలో ఉన్నారు.

ఆ మృతదేహం ఎవరిది…?
చెరువులో మృతి చెందింది సతీష్  అని భావించిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గ్రామానికి తీసుకు వెళ్ళి దహనం చేశారు.  ప్రస్తుతం సతీష్  బతికే ఉన్నాడు. అయితే చెరువులో లభించిన మృతదేహం ఎవరిది అన్న విషయంపై సందిగ్థత నెలకొంది. పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. మృతదేహం దహనం చేయడంతో ప్రస్తుతం మృతుడి ఆనవాళ్లు కూడా లభించే పరిస్థితి లేదు. ఆదివారం వరకు ఈ విషయంపై ఎలాంటి స్పష్టత రాలేదు. కాగా,  సతీష్ తల్లి వద్ద పోలీసులు మరో ఫిర్యాదు తీసుకుని గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేయనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios