అమరావతి: ఏపీ నీటి పారుదల శాఖకు కృష్ణా రివర్ బోర్డు మంగళవారం నాడు షాకిచ్చింది. తమకు కేటాయించిన నీటి కేటాయింపుల కంటె ఎక్కువగా నీటిని వాడుకొంటున్నారని కృష్ణా బోర్డు తేల్చి చెప్పింది.  ఈ నీటి కేటాయింపుల విషయంలో ఉత్తర్వులను విధిగా పాటించాలని కృష్ణా రివర్ బోర్డు ప్రకటించింది.

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తమకు కేటాయించిన కేటాయింపుల కంటే ఎక్కువగా నీటిని వాడుకోవడాన్ని కృష్ణా రివర్ బోర్డు గుర్తు చేసింది. సాగర్ కుడి కాల్వ ద్వారా 158.26 టీఎంసీలు, హంద్రీనీవా ద్వారా 47.17 టీఎంసీల నీటిని వాడుకొన్నారని కృష్ణా బోర్డు ఏపీ నీటి పారుదల శాఖకు తేల్చి చెప్పింది.

సాగర్ కుడి కాల్వకు, హంద్రీనీవా, ముచ్చుమర్రి నుండి నీటి విడుదలను వెంటనే నిలిపివేయాలని కృష్ణా బోర్డు మెంబర్ సెక్రటరీ ఏపీ ప్రభుత్వానికి మంగళవారం నాడు లేఖ రాశారు. మే నెలలో ఏపీకి కేటాయించిన కేటాయించిన దాని కంటే ఎక్కువగా ఆ రాష్ట్రం నీటిని వాడుకొందని కృష్ణా బోర్డు గుర్తు చేసింది. 

also read:పోతిరెడ్డిపాడు ఎఫెక్ట్: తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు

నది జలాల నీటి వాడకం విషయంలో ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం ఇవ్వొద్దని ఆయన ఏపీకి సూచించారు.ఏపీ రాష్ట్రానికి కేటాయించిన వాటాను ఇప్పటికే వాడుకొన్నారని కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. 

పోతిరెడ్డి పాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచాలని ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవోపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఇటీవల ఫిర్యాదు చేసింది. మరో వైపు ఏపీ ప్రభుత్వం కూడ ఈ నెల 18వ తేదీన తెలంగాణ రాష్ట్రం కూడ కృష్ణా నదిపై ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్టుగా ఫిర్యాదు చేసింది. 

కృష్ణా నది జలాల విషయంలో రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకొన్నాయి. ఈ తరుణంలో ఏపీ రాష్ట్రానికి కృష్ణా బోర్డు ఇవాళ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకొంది.