చంద్రబాబు వ్యూహం: పవన్ కల్యాణ్ ను వెంటాడుతున్న కులం

Still caste is haunting Pawan Kalyan
Highlights

పవన్ కల్యాణ్ ను కులం వెంటాడుతూనే ఉంది. చంద్రబాబు వ్యూహంలో భాగంగా టీడీపీ నేతలు ఆయనకు కులాన్ని అంటగట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. పవన్ కల్యాణ్ ఎన్నిమార్లు చెప్పినా అదే వ్యూహాన్ని టీడీపి నేతలు అనుసరిస్తూ వస్తున్నారు.

విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఇంకా కులం వెంటాడుతూనే ఉంది. తాను ఏ కులానికి కూడా ప్రతినిధిని కానని ఆయన చెప్పినా ప్రత్యర్థులు వదిలిపెట్టడం లేదు. రాజకీయంగా ఆయనను దెబ్బ తీసే ప్రయత్నంలో భాగంగానే ఆయనకు కులం అంటగడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అందులో నిజం కూడా ఉండవచ్చు. అందుకే ఆయన పదే పదే ఆ విషయంపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నరాు. 

జనసేన కుల పార్టీ కాదని ఆయన తాజాగా గురువారం స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు తనకు కులాన్ని ఆపాదిస్తున్నారని, కానీ, తన తండ్రి అలా పెంచలేదని స్పష్టం చేశారు. కులపిచ్చి ఉంటే గత ఎన్నికల్లో టీడీపీకి ఎందుకు మద్దతు ఇస్తానని అడిగారు. 

అప్పుడు గుర్తుకురాని కులం ఇప్పుడు ఎందుకు వస్తుందో చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వ్యూహంలో భాగంగానే టీడీపి నుంచి అటువంటి విమర్శలు వస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన, పవన్‌ కల్యాణ్‌ వేర్వేరని ఆయన చెప్పారు. విశాఖపట్నం పోర్టు కళావాణి స్టేడియంలో గురువారం పలువురు జనసేనలో చేరిన సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు, ఆ తర్వాత గాజువాకలో నిర్వహించిన సభలోనూ పవన్‌కల్యాణ్‌ మాట్లాడారు. 

2014 ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో జనసేనకు కొన్ని సీట్లు ఇవ్వాలని కోరానని చెప్పారు. ఈ విషయం మరుసటిరోజు పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చిందన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన విషయం పత్రికల్లో రావడంతో వారికి దూరంగా జరిగానని చెప్పారు. మళ్లీ వారు సంప్రదింపులు జరిపి, తన దగ్గరకు రావడంతో షరతులు లేకుండా మద్దతు ప్రకటించానని అన్నారు. 

ఒకానొక సమయంలో సమాజంలో అసమానతల నివారణకు తీవ్రవాదంవైపు వెళ్లాలనుకున్నానని పవన్‌ కల్యాణ్‌ వివరించారు. తుపాకీ పట్టాలనే తన కోరికను అర్థం చేసుకున్న అన్నయ్య ఓ రివాల్వర్‌ కొనిపెట్టారని కూడా అన్నారు. దానితో తాను ప్రేమలో పడిపోయానన్నారు. పడుకునేటపుడు కూడా పక్కనే పెట్టుకునేవాడినని, ఉదయం లేవగానే దానిని ముద్దు పెట్టుకునేవాడినని గుర్తు చేసుకొన్నారు.

loader