కర్నూలు: పోలీసులు నిషేధం విధించి, కాపలా కాసినప్పటికీ దేవరగట్టు కర్రల సమరం కొనసాగింది. కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో యేటా బన్నీ ఉత్సవం సందర్భంగా మాల మల్లేశ్వర స్వామి విగ్రహాన్ని దక్కించుకునేందుకు వివిధ గ్రామాల ప్రజలు రెండు విడిపోయి కర్రలతో కొట్టుకోవడం సంప్రదాయంగా వస్తోంది. 

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పోలీసులు కర్రల సామును నిషేధించి, లోనికి ప్రజలు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే, చిమ్మచీకటిలో పోలీసుల కళ్లు గప్పి ప్రజలు పొదలను మాటు చేసుకుని దేవరగట్టుకు చేరుకున్నారు. 

రాత్రి పది గంటల వరకు పోలీసుల అదుపులో ఉన్న దేవరగట్టు ఒక్కసారిగా ప్రజలతో మారుమోగిపోయింది. దేవరగట్టులో ఎప్పటిలాగే కర్రల సమరం సాగింది. నేరణికి, నెరణికి తండా, కొత్తపేట, సుళువాయి గ్రామాల ప్రజలు దేవరగట్టుకు చేరుకుని కర్రల సమరంలో పాల్గొన్నారు. 

సోమవారం రాత్రి పదిన్నర గంటల వరకు ఖాళీగా ఉన్న తేరు బజారు ఒక్కసారిగా ప్రజలతో నిండిపోయింది. ఆలయంలో అర్చకులు స్వామి కల్యాణం నిర్వహించారు. ఆ తర్వాత ఉత్సవ విగ్రహాలను కొండపై నుంచి కిందికి తెచ్చి సింహాసనం కట్ట వద్ద ఉంచారు. అక్కడి నుంచి భక్తులు విగ్రహాలకు కర్రలు అడ్డుగా ఉంచి రాక్షసపడ వద్దకు తీసుకుని వెళ్లారు.

దాదాపు లక్ష మంది దేవరగట్టు జాతరలో పాల్గొన్నట్లు అంచనా వేస్తు్నారు. కర్రల సమరంలో దాదాపు 50 మంది గాయపడ్డారు. అందులో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారని ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

ఈసారి కర్రల సమరంపై నిషేధం విధించడంతో దేవరగట్టు వద్ద తాత్కాలిక ఆస్పత్రి ఏర్పాటు చేయలేదు. దీంతో గాయపడినవారికి చికిత్స అందించడం ఇబ్బందిగా మారింది.