Asianet News TeluguAsianet News Telugu

36కేసుల కోసం 32మంది ప్రాణత్యాగం ఫణంగా...: అచ్చెన్నాయుడు ఆగ్రహం

స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖ ఉనికికే ప్రమాదమని...పరిశ్రమ భూముల్లో వాటాలు కొట్టేయడానికే వైసీపీ మొసలి కన్నీరు కారుస్తోందని ఏపి టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. 

Steel plant privatisation... TDP support to call for State bandh on March 5
Author
Amaravathi, First Published Mar 4, 2021, 4:13 PM IST

గుంటూరు: విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి, కార్మిక సంఘాలు  మార్చి 5వ తేదీన తలపెట్టిన బంద్ కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ బంద్ ను టీడీపీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించుకునేందుకు సమైక్యంగా పోరాడదామని... ఐదు కోట్ల ఆంధ్రులను సమీకరిద్దామని అచ్చెన్న పిలుపునిచ్చారు. 

''స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖ ఉనికికే ప్రమాదం. భూముల్లో వాటాలు కొట్టేయడానికే వైసీపీ ముసలి కన్నీరు కారుస్తోంది. పరిశ్రమను కాపాడుకునేందుకు కలిసి పోరాడదామని అధికార వైసీపీని పిలిస్తే ఉలుకూ పలుకూ లేదు. స్టీల్ ప్లాంట్ వల్ల 40 వేల మందికి ప్రత్యక్షంగా, లక్షమందికి పరోక్షంగా మొత్తంగా ఐదు లక్షలమందికి ఉపాధి లభిస్తోంది. స్టీల్ ప్లాంట్ వల్ల కేంద్రానికి ఇప్పటివరకూ రూ. 33 వేల కోట్లు, రాష్ట్రానికి రూ. 8 వేల కోట్లు పన్నుల రూపంలో వచ్చింది. అటువంటి కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తుంటే ఏమీ పట్టనట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని పబ్జీ గేమ్ ఆడుకుంటున్నారు'' అని మండిపడ్డారు. 

''నాడు 32మంది ప్రాణత్యాగం చేసి ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటే నేడు 36 కేసుల మాఫీ కోసం జగన్మోహన్ రెడ్డి వారి ప్రాణత్యాగాలను వాడుకుంటున్నారు. ప్రజా ప్రయోజనాల విషయంతో తెలుగుదేశం పార్టీ రాజీలేని పోరాటం చేస్తుంది. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీని ఓడించి స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుందాం'' అని కోరారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios