Asianet News TeluguAsianet News Telugu

బావాబామ్మర్ధులపై ‘‘తొక్కిసలాట’’ ఎఫెక్ట్.. కుప్పంలో బాబుకి, ఒంగోలులో బాలయ్యకి జగన్ మార్క్ షాక్

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ఒంగోలు పోలీసులు అనుమతి రద్దు చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 

stampede effect on nandamuri balakrishna veera simha reddy pre release event
Author
First Published Jan 4, 2023, 8:59 PM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎల్లుండి ఒంగోలులో జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. బాలయ్య అభిమానులు కూడా ఈ వేడుకకి హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలాంటి దశలో ఒంగోలు పోలీసులు మెలిక పెట్టారు. నగరంలో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించరాదని తేల్చిచెప్పారు. దీనికి బదులుగా ప్రత్యామ్నాయ వేదికను చూసుకోవాలని సూచించారు. ఒంగోలులో బాలయ్య ఫ్యాన్స్ తాకిడి ఎక్కువగా వుంటుందని, ట్రాఫిక్ ఇబ్బందుల షాకు చెప్పి ఈవెంట్‌ వేదికను మార్చుకోవాల్సిందేనని కరాఖండీగా తేల్చిచెప్పేశారు. 

అయితే దీని వెనుక జగన్ ప్రభుత్వ హస్తం వుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాట చోటు చేసుకుని 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత పాల్గొంటున్న కార్యక్రమాల్లో ఏర్పాట్లు చేసేది ఇలాగేనా అంటూ ప్రభుత్వంపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అటు వైసీపీ సైతం దీనికి ధీటుగానే బదులిస్తోంది. డ్రోన్ షాట్లు, జనం ఎక్కువగా వచ్చినట్లు చూపించుకోవాలన్న చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి జనం బలవుతున్నారంటూ కౌంటర్ ఇస్తున్నారు. 

ALso REad: ఒంగోలులో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ : వేదిక మార్చుకోండి.. నిర్వాహకులకు పోలీసుల సూచన

కందుకూరు, గుంటూరు సభల్లో చోటు చేసుకున్న విషాదం తర్వాత వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం  తీసుకుంది. రాష్ట్రంలో రోడ్ షోలు, బహిరంగ సభలు, సమావేశాలకు అనుమతి లేదని తేల్చిచెప్పింది. తప్పనిసరి పరిస్ధితుల్లో పోలీసుల నుంచి అనుమతి తీసుకుని.. వారు చెప్పిన విధంగా నడుచుకోవాలని చెడుతూ జీవో జారీ చేసింది. అయితే ఇది ప్రభుత్వ కక్షసాధింపులో భాగమేనని.. చంద్రబాబు, పవన్ కల్యాణ్,నారా లోకేష్‌లో రోడ్ షోలను అడ్డుకోవడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ విషయంలో ముందుకే సాగిన ప్రభుత్వం.. ఇవాళ చంద్రబాబు కుప్పం పర్యటను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ప్రచార రథాన్ని స్వాధీనం చేసుకుని పీఎస్‌కు తరలించడంతో పాటు చంద్రబాబు కుప్పం రాకుండా అవరోధాలు సృష్టించింది. అయినప్పటికీ బాబు తన నియోజకవర్గంలో ల్యాండ్ అయ్యారు. 

సరిగ్గా ఈ వ్యవహారం వేడిగా వున్న సమయంలోనే బాలకృష్ణ వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అనుమతులు రద్దు చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బాలకృష్ణ స్వయంగా టీడీపీ అధినేతకు వియ్యంకుడు కావడం, ఆ పార్టీలో కీలక సభ్యుడు కావడం వల్లే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరసింహారెడ్డి ఈవెంట్‌కు వేదికగా తీసుకున్న ఒంగోలులో తెలుగుదేశం సానుభూతిపరులతో పాటు చంద్రబాబు సామాజిక వర్గానికి కంచుకోట.

గతేడాది మహానాడు కూడా ఇక్కడే నిర్వహించిన నేపథ్యంలో... ఇప్పుడు వ్యూహాత్మకంగానే వీరసింహారెడ్డి ఈవెంట్ కూడా ఒంగోలులో ప్లాన్ చేశారని వైసీపీ పెద్దలు భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఆ కోణంలో ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే పోలీసులు వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అనుమతులు రద్దు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరి పోలీసులు చెప్పినట్లుగా ఒంగోలులో కాకుండా నగరానికి దూరంగా నిర్వహిస్తారా లేదంటే.. అక్కడ కూడా పర్మిషన్ ఇవ్వరనే భయంతో ఏకంగా ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా హైదరాబాద్‌కి ప్రోగ్రామ్‌ను షిఫ్ట్ చేస్తారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో తెలియాంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.

Follow Us:
Download App:
  • android
  • ios