నెల్లూరు: టెక్నాలజీ పెరిగినా కూడ మూడ నమ్మకాలను ప్రజలు వదలడం లేదు. చనిపోయిన వ్యక్తి బతికొస్తాడని భ్రమలో 37 రోజులుగా స్మశానంలోనే ఓ కుటుంబం నివాసం ఉంటుంది. స్థానికుల సమాచారం మేరకు  పోలీసులు ఈ కుటుంబానికి కౌన్సిలింగ్ నిర్వహించి ఇంటికి పంపించారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకొంది.

నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలంలోని పెట్లూరు గ్రామానికి చెందిన తుపాకుల శ్రీనివాస్ అనే వ్యక్తి డెంగ్యూతో 37 రోజుల క్రితం మరణించారు. శ్రీనివాస్ టాక్సీ డ్రైవర్ గా పనిచేసేవాడు. 

చనిపోవడానికి ముందు శ్రీనివాస్ కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన ఓ వ్యక్తితో ఘర్షణకు దిగాడు. ఈ వ్యక్తితో గొడవకు దిగిన వ్యక్తే  చేతబడి చేయించడంతోనే శ్రీనివాస్ మృతి చెందాడని కుటుంబసభ్యులు నమ్మారు.

శ్రీనివాస్ కుటుంబసభ్యులు ఓ మంత్రగాడిని సంప్రదించారు. సుమారు 41 రోజుల తర్వాత శ్రీనివాస్ ను బతికిస్తానని క్షుదపూజలు చేసే వ్యక్తి వారిని నమ్మించాడు. శ్రీనివాస్ కుటుంబంతో మంత్రగాడు రూ.8 లక్షలు డీల్ కుదుర్చుకొన్నాడు.

శ్రీనివాస్ ను పూడ్చిన రోజు నుండి 41 రోజులపాటు స్మశానంలోనే కుటుంబసభ్యులంతా నివాసం ఉండాలని మంత్రగాడు వారిని చెప్పాడు. మంత్రగాడు చెప్పినట్టుగానే శ్రీనివాస్ కుటుంబసభ్యులు స్మశానంలోనే 37 రోజులుగా నివాసం ఉంటున్నారు.

ఈ స్మశానం నుండి  ఈ కుటుంబాన్ని బయటకు పంపేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలను శ్రీనివాస్ కుటుంబసభ్యులు అడ్డుకొన్నారు. అంతేకాదు కత్తులు, ఇతర మారణాయుధాలను పట్టుకొని స్థానికులను భయబ్రాంతులకు గురి చేశారు. 

ఈ విషయం స్థానికుల ద్వారా తెలుసుకొన్న పోలీసులు శనివారం నాడు పెట్లూరు స్మశానంలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీసులు కౌన్సిలింగ్ తర్వాత శ్రీనివాస్ కుటుంబసభ్యులు ఇంటికి వెళ్లారు.క్షుద్రపూజలు చేసేందుకు ముందుకు వచ్చిన మంత్రగాడికి శ్రీనివాస్ కుటుంబసభ్యులు సుమారు రూ.7 లక్షలను ఇప్పటికే చెల్లించారు.