టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. ప్రభుత్వోద్యోగులను బెదిరించారని ఆయనపై ఏపీఎన్జీవో నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో.. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సరుబుజ్జిలి ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లిన రవికుమార్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయన్నారు.

టీడీపీ కార్యకర్తలు తెచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోకుండా నాటకాలు వేస్తే అధికారులను గదిలో వేసి చావగొడతానని రవికుమార్ వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ ఎన్జీవో నేతలు మండిపడుతున్నారు.

ప్రభుత్వోద్యోగులను బెదిరించిన రవికుమార్ వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. ఆయన బెదిరింపులకు పాల్పడ్డ ఆడియో, వీడియో సాక్ష్యాలు తమ దగ్గర ఉన్నాయని తెలిపారు. రవికుమార్‌పై చర్యలు తీసుకోకపోతే ఉద్యోగులమంతా మూకుమ్మడి సెలవుల్లోకి వెళతామని హెచ్చరించారు.

ఎంపీడీవో ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు రవికుమార్‌పై కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు ఆముదాలవలస వెళ్లగా.. రవికుమార్ అందుబాటులో లేకపోవడంతో ఆయన కోసం గాలిస్తున్నారు.