న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని మోడీ ఇచ్చిన మాటను తప్పారని, అందుకే తాము నిరసనలకు దిగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహాన్ నాయుడు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మోడీ నియంతృత్వానికి వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఓటు చేస్తారన్నారు. మన్‌కీ బాత్ కాదు, జన్‌కీ బాత్ కూడ పట్టించుకోవాలంటూ  మోడీపై రామ్మోహన్ నాయుడు సెటైర్లు వేశారు.

సోమవారం నాడు పార్లమెంట్‌‌లో  బడ్జెట్‌పై జరిగిన చర్చలో టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. న్యూఢిల్లీలో చంద్రబాబునాయుడు ఎందుకు దీక్ష చేయాల్సి వచ్చిందో ఆయన వివరించారు.

ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కింద ప్రయోజనం పొందుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2014లో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇంతవరకు హోదా ఇవ్వలేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని చెప్పారు. ఈ ప్యాకేజీ కింద నయా పైసా కూడ ఇవ్వలేదని  ఆయన గుర్తు చేశారు.ప్రత్యేక హోదా ఇస్తే  తాము ఎందుకు  నిరసనలు చేస్తామని  ఆయన ప్రశ్నించారు.

విశాఖకు రైల్వే జోన్ కూడ ఇంతవరకు ప్రకటించలేదన్నారు. విశాఖకు రైల్వేజోన్ ఇస్తే ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెబుతోందన్నారు. కానీ, ఒడిశా సర్కార్ మాత్రం తమకు విశాఖకు రైల్వే జోన్ ఇస్తే  తమకు అభ్యంతరం లేదని  ఒడిశా ప్రకటించినట్టు రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు.

తమ రాష్ట్రానికి దక్కాల్సిన హక్కుల కోసం పోరాటం చేయడం తప్పా అని ఆయన ప్రశ్నించారు.  హక్కుల కోసం ప్రశ్నిస్తే సీబీఐ, ఈడీలను ప్రయోగిస్తున్నారని రామ్మోహన్ నాయుడు చెప్పారు.

నిన్న గుంటూరులో పర్యటించిన మోడీ ... ఏపీ సీఎం చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలకు దిగారని  ఆయన గుర్తు చేశారు. వ్యక్తిగత విమర్శలకు దిగి ప్రధాని పదవి స్థాయిని దిగజార్చారని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. హక్కుల కోసం బాబు ప్రశ్నించినందుకే  మోడీ తన స్థాయి దిగజార్చుకొని మాట్లాడారని ఆయన అభిప్రాయపడ్డారు. విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాలని  ఆయన డిమాండ్ చేశారు.

వెనుకబడిన జిల్లాలకు ప్రతి ఏటా ఇచ్చే నిధులను కూడ కేంద్రం వెనక్కు తీసుకొందన్నారు.  ఇచ్చిన నిధులను వెనక్కు తీసుకొన్న చరిత్ర ఏనాడూ లేదన్నారు. అవినీతికి పాల్పడినందునే నిధులను వెనక్కు తీసుకొన్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని రామ్మోహన్  నాయుడు చెప్పారు.

ఏపీ రాష్ట్రం ప్రభుత్వ పనితీరును చూసి కేంద్రమే 647 అవార్డులను ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తప్పుడు ప్రచారంతో తమ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

రూ.1500 కోట్లతో ప్రపంచంలో అత్యుత్తమైన రాజధాని నిర్మాణం ఎలా సాధ్యమౌతోందని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ప్లాన్  ఉంటే తమకు ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలను అమలు చేయలేదన్నారు.

సబ్ కా సాత్, సబ్ కా వికాస్ గురించి  మాటల్లోనే కాదు చేతల్లో ఉండాలని ఆయన కేంద్రానికి చురకలంటించారు. ఎన్నికల ముందు  ఇదే తరహాలో నాన్ బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్న  రాష్ట్రాల్లో  ఈడీ, సీబీఐలను ప్రయోగించారని  రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.

రాష్ట్రంలో  కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని ఇచ్చినా కూడ కేంద్రం  మాత్రం సానుకూలంగా  నిధులను ఇవ్వలేదన్నారు. కేవలం రూ.745 కోట్లను మాత్రమే కేటాయించిందన్నారు. 

తన ప్రసంగం చివర్లో  గురజాడ అప్పారావు రాసిన దేశమును ప్రేమించమన్నా.. అనే గేయాన్ని రామ్మోహన్ నాయుడు తొలుత తెలుగులో చదివి విన్పించారు. ఆ తర్వాత ఇదే గేయం భావాన్ని ఆయన ఇంగ్లీష్‌లో అనువదించి చెప్పారు. ఆ తర్వాత బడ్జెట్ ప్రసంగంలో పాల్గొన్న వైసీపీ ఎంపీ బుట్టా రేణుక కూడ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.   

సంబంధిత వార్తలు

28 ఏళ్ల పరిచయం: బాబు దీక్షలో ఆజాద్

ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు: శరద్ పవార్

మోడీ సభకు వైసీపీ ఫ్లెక్సీలు: గుట్టు విప్పిన లోకేష్

దేవుడి సాక్షిగా ప్రమాణం చేసి....: మోడీపై కేజ్రీవాల్ ఫైర్

ఏపీ డిమాండ్లు నెరవేర్చాలి: ములాయం

దీక్ష: జయరామ్ రమేష్‌కు చంద్రబాబు కితాబు

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: మన్మోహన్ సింగ్

ఏపీ భారత్‌లో భాగం కాదా: చంద్రబాబు దీక్షకు రాహుల్ మద్దతు