శ్రీకాకుళం జిల్లాకు ఫణి తుఫాను ముప్పు తప్పినట్లేనని జిల్లా కలెక్టర్ జె.నివాస్ స్పష్టం చేశారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఫణి తుఫాను కదలికలను ఆయన కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్టీజీఎస్ ముందుగా సూచించిన విధంగానే తుఫాను తన పయనం సాగించిందన్నారు. వర్షపాతం సైతం అనుకున్న విధంగానే నమోదైందని నివాస్ తెలిపారు.

కంచిలి మండలంలో 19 సెంటిమీటర్లు వర్షం కురిసిందని, ఇచ్ఛాపురంలో 140 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచాయని వెల్లడించారు. లోతట్టు ప్రాంతాలలో ఉన్న గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు నమోదు కాలేదని కలెక్టర్ ప్రకటించారు.

ఇచ్ఛాపురంలో మూడు ఇళ్లు, కొన్ని చోట్ల కరెంట్ స్థంభాలు వాలిపోయినట్లు తెలిపారు. మరోవైపు ఒడిషాతో పాటు జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నందున వరదలు వచ్చే అవకాశం ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని నివాస్ అధికారులకు సూచించారు. ఈదురుగాలుల వలన కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.