Asianet News TeluguAsianet News Telugu

శ్రీగౌతమి కేసు: 6 వేల చాటింగ్, 11 వేల ఫోన్ సంభాషణలు, బుజ్జికి ఉచ్చు బిగించిన ఫోన్

బుజ్జి కొంపముంచిన శ్రీగౌతమి ఫోన్

Srigowhami phone helps to CID police for murder case investigation


ఏలూరు: శ్రీగౌతమి రోడ్డు ప్రమాదంలో మరణించలేదని, హత్య చేశారని  ఆమె సోదరి పావని చేసిన పోరాటం ఫలించింది. రోడ్డు ప్రమాదం కాదని శ్రీగౌతమిది హత్యగా నిరూపించేందుకుగాను  అవసరమైన సాక్ష్యాలను  పావని  సీఐడీ పోలీసులకు అందించింది.ఈ సాక్ష్యాల ఆధారంగా పోలీసులు శ్రీగౌతమిది హత్యేనని 18 మాసాల తర్వాత తేల్చేశారు. బుజ్జి, శ్రీగౌతమి మధ్య చోటు చేసుకొన్న ఫోన్ సంభాషణలు, 6 వేల వాట్సాప్ చాటింగ్ వివరాలను పోలీసులకు అందించింది.శ్రీగౌతమిని హత్య చేశారని తేల్చేందుకు ఈ సాక్ష్యాలు ఉపయోగపడ్డాయి.

గత ఏడాది జనవరి 18వ తేదిన శ్రీ గౌతమి, పావని స్కూటీపై  ప్రయాణం చేస్తుండగా వెనుక నుండి  టాటా సఫారీ వాహనంతో ఢీకొట్టారు నిందితులు.  ఈ ప్రమాదంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీగౌతమి మరణించింది. తీవ్రంగా గాయపడిన పావని  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయం నుండి తప్పించుకొంది. శ్రీగౌతమితో పాటు పావనని కూడ చంపేయాలని నిందితులు ప్లాన్ చేశారు. కానీ, పావని ప్రాణాలతో బతికి బయటపడింది.

తొలుత శ్రీగౌతమిది రోడ్డు ప్రమాదంగా గుర్తించిన పోలీసులు ఆ దిశగానే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.  హత్య కాదని రోడ్డు ప్రమాదంలోనే శ్రీగౌతమి మరణించిందని పోలీసులు ప్రకటించారు. 

అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్పృహలోకి వచ్చిన పావని అసలు విషయాన్ని వెల్లడించింది. శ్రీగౌతమిని టిడిపి నేత బుజ్జి వివాహం చేసుకొన్నాడని పావని బయటపెట్టింది. పెళ్ళి ఫోటోలను కూడ విడుదల చేసింది.ఈ విషయం తమకు తల్లికి కూడ తెలియదని పావని చెప్పింది. గత ఏడాది ఆగష్టులో బుజ్జిని తాను రహస్యంగా వివాహం చేసుకొన్నట్టుగా శ్రీగౌతమి తనకు చెప్పిందని పావని చెప్పారు.

అయితే గత ఏడాది సెప్టెంబర్ మాసం నుండి శ్రీగౌతమికి  బుజ్జి కుటుంబం నుండి బెదిరింపులు వచ్చాయని పావని చెబుతున్నారు. బుజ్జి డ్రైవర్ శ్రీగౌతమిని బెదిరించారని కూడ పావని చెప్పింది.ఈ విషయాలను తనతో చెప్పిందని ఆమె గుర్తు చేసుకొన్నారు.

శ్రీగౌతమిని వివాహం చేసుకొన్న విషయం బుజ్జి మొదటి భార్యకు తెలిసిన తర్వాత ఆ కుటుంబంలో కూడ వివాదాలు చోటు చేసుకోవడంతో  శ్రీగౌతమిని తొలగించుకోవాలని బుజ్జి ప్లాన్ చేశారని పావని ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి శ్రీగౌతమి అడ్డుతొలగించుకొనేలా చంపేశారని పావని ఆరోపిస్తున్నారు. ఈ విషయాలన్నీ తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.

సంఘటన జరిగిన రోజున  తమను సపారీ వాహనంలో నిందితులు వెంటాడీ మరీ రెండు దఫాలు ఢీకొట్టారని  చెప్పారు. వదిలేయాలని తాను అరిచినా పట్టించుకోకుండా తాను కారుపై పడితే అలానే కారును తీసుకెళ్ళారని పావని గుర్తు చేసుకొన్నారు.

రోడ్డు ప్రమాదంగా ఈ కేసును మూసివేయడంతో పావని న్యాయపోరాటానికి దిగింది. పావనికి మద్దతుగా లెఫ్ట్ పార్టీలు, లెప్ట్ పార్టీల అనుబంధ విద్యార్ధి సంఘాలు నిలిచాయి. ఈ కేసులో ఆమె విజయం సాధించేందుకు కృషి చేశాయి.

శ్రీగౌతమి ఉపయోగించిన ఫోన్‌ను పావని సంఘటన స్థలం నుండి తెచ్చుకొంది.ఈ ఫోన్ నుండి అతి కష్టం మీద డేటాను రీకవరీ చేయించింది. శ్రీగౌతమి, బుజ్జి మధ్య 11,088 దఫాలు ఫోన్ సంభాషణలు రికార్డయ్యాయి. 

వీరిద్దరి మధ్య 6వేల చాటింగ్ సంభాషణలు చోటు చేసుకొన్నాయి. వీటిని సాక్ష్యాలుగా పావని సీఐడీ అధికారులకు అందించింది. దీంతో సీఐడీ అధికారులు కేసును విచారణ చేస్తే శ్రీగౌతమిది హత్యేనని తేల్చారు.

బుజ్జితో తనకు వివాహం జరిగినా  కానీ, ఆమెకు భార్యగా స్థానం దక్కలేదు. దీంతో ఆమె కాపురం పెట్టాలని బుజ్జిపై ఒత్తిడి తెచ్చింది. బుజ్జి మాత్రం ఇందుకు ససేమిరా అన్నాడు. దీంతో వీరిద్దరి మధ్య  వాదోపదాలు చోటుచేసుకొన్నాయి. 

శ్రీగౌతమిని అంతమొందించాలని బుజ్జి ప్లాన్ చేశారు. గత ఏడాది సెప్టెంబర్ మాసంలో పాలకొల్లులో ఫ్లాట్ తీసుకొని కాపురం పెడతానని బుజ్జి తన సోదరికి హమీఇచ్చారని పావని చెప్పారు. 

 శ్రీగౌతమిని చంపించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేలా ప్లాన్ చేశారు. ఈ పనిచేసేందుకు ముందుకు వచ్చిన నిందితులకు అవసరమైన డబ్బును కూడ బుజ్జి మధ్యవర్తి ద్వారా అందించారని సీఐడీ పోలీసులు తేల్చిచెప్పారు.

నిందితులకు డబ్బును నేరుగా అందించారని చెప్పారు. ఒక్క దఫా ఆన్‌లైన్‌లో డబ్బును ఇచ్చిన విషయాన్ని కూడ సీఐడీ గుర్తించింది. పావని ఇచ్చిన ఆధారాలతో విచారించిన  సీఐడీకి పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. దీంతో 18 మాసాల తర్వాత శ్రీగౌతమి మృతి కేసును హత్య కేసుగా సీఐడీ గుర్తించింది. మంగళవారం నాడు  ఈ కేసులో నలుగురు టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు.  


 

Follow Us:
Download App:
  • android
  • ios